తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 (ఈ రోజు) నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగనుంది. ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

ఈ శీతాకాల సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సెషన్‌లోనే పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్, కులగణన సర్వే సహా.. పలు నూతన చట్టాలపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. రారా అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. సీఎం రేవంత్ కేసీఆర్‌ను పదే పదే అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యింది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

2.అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం బాలేదని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ ఆహ్వానించారు.

3.కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించడం వేనక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. రారా అనే చర్చ జరుగుతోంది.

4.బయట ప్రెస్‌మీట్‌లు, బహిరంగ సభల్లో మాట్లాడిన విషయాల కంటే.. అసెంబ్లీలో మాట్లాడిన అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.

5.అందుకే కేసీఆర్‌ను అసెంబ్లీకి ఆహ్వానించి.. ఆయన ముందే బీఆర్ఎస్ వైఫల్యాలను నిలదీయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

6.గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి.. ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని రేవంత్ సర్కారు ప్లాన్‌తో ఉన్నట్టు సమాచారం.

7.అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌజ్ ముఖ్యమంత్రి కాబట్టి.. ఆయనకే మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో ఎక్కువగా రేవంత్ వాయిస్ బయటకు వెళ్లే అవకాశం ఉంది.

8.అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఉన్నా.. అధికార పార్టీదే పైచేయి ఉంటుంది. అందుకే అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది.

9.ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు.. బీఆర్ఎస్ తరఫున తమ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. అయితే.. రేవంత్ వారితో పోల్చుకోవడం లేదు. అందుకే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

10.అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్‌ను నిలదీయాలని కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here