* కేసీఆర్ నషానా గుడ లేకుండ జేస్త అని.. తెలంగాణ నషానా లేకుండా జేస్తుండు
* జయ జయహే పాట మార్షిండు
* రాష్ట్ర గుర్తులో చార్మినార్, కాకతీయ తోరణం తీసే కోషిష్ జేశిర్రు
* తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నరు
* సప్పడు జేయని తెలంగాణ మేధావులు
* ఉద్యమ చరిత్ర నిషానాలు మీద దాడి
* సంక్షేమానికి ఖజానా ఖాళీ అంటాడు.. మళ్ళీ దుబారా ఖర్చు చేస్తుండు
(మన క్రాంతిన్యూస్ ప్రత్యేక కథనం )
సరిగ్గ యాడాది కింద కాంగిరెసు పార్టీ ఎలచ్చన్లల్ల గెలిచి రేవంత్ రెడ్డి సిఎం కుర్సి ఎక్కిండు. సిఎం అయినంక రేవంత్ రెడ్డి జెప్పిన ముచ్చెట కేసీఆర్ నషానా గుడ లేకుండ జేస్త అని. ఈ యాడాదిల రేవంత్ రెడ్డి ఇగ షెప్పినట్టే జేత్తనే ఉన్నడాయె.. ముందుగాల ముందుగాల తెలంగాణ ఉద్యమ, రాష్ట్ర గీతంగా ఉన్న జయ జయహే తెలంగాణ అన్న పాటను ఆంధ్ర ప్రాంత సంగీత దర్శకులతో మార్సిండు. గిప్పటికీ కూడ తెలంగాణల పబిలిక్కు గా పాటను ఒప్పుకుంతలేదు.. గట్లనే రాష్ట్ర గుర్తును గుడ మార్సనీకి కోషిష్ జేత్తనే ఉన్నరు.. హైదరాబాద్ అంటె ఏం జెప్పుకుంతం? చార్మినార్‌నే గద..? తెలంగానలకు అచ్చిన సుటపకాలకు…గదేనుల్లా…అతిథులకు చార్మినార్ రూపంల ఉన్న గుర్తులను ఇత్తం.. గసుంతి చార్మినార్ ని తీసే కోషిష్ జేశిర్రు. గట్లనే కాకతీయ తోరణం కూడా తీసేతందుకు జూత్తాన్నరు. తెలంగాణ పబిలిక్కంత మస్తు గుస్స అయ్యెతాకల్ల ఎన్ కకు తగ్గిర్రు.
గిప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నరు. అస్సలు గీ విగ్రహం మార్సుడు గురించి మాట్లాడుకునుడు కంటె ముందు మనం తెలంగాణ తల్లి చెరిత్ర గురించి తెలుసుకోవాలె.. విగ్రహం ఏమిట్కి రూపొందించిన్రు? ఒవ్వలు రూపొందించిన్రు? గా అవుస్రం ఏమిట్కచ్చింది?
గా నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ.. పబిలిక్కుల ఉద్యమస్ఫూర్తిని రగిలిచనీకి 2006 ల ఎలిసింది తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి భావన తెలంగాణా ప్రాంత పబిలిక్కుల శాన రోజుల్నించి ఉన్నది. సమైక్య వాదులు తెలుగు తల్లి పేరుతోని భాష అస్తిత్వాన్ని తెలంగాణ మీద రుద్దేతందుకు కోషిష్ జేసినప్పుడు, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తేవాలన్న ఆలోచన జయశంకర్ సార్ కేసీఆర్ తోని గల్సి జేశిన్రు
తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బీఎస్ రాములు పస్టుసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జేసిర్రు కంపూటర్ మీద తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన సారు బీవీఆర్ చారి. గీ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంల అస్తున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వార పత్రిక కవర్ పేజీమీద చెపాయించిర్రు. ప్రచురితమైంది.
తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు దీస్కపొయి ఉద్యమ సారథి కేసీఆర్, జయశంకర్ సార్ల ముందు బెట్టిర్రు. గప్పుడు కేసీఆర్ సారు కొన్ని మార్పులు జెప్పిర్రు.. గీ విషయంల మాట్లాడనీకి రొన్డు సమావేశాలు నిర్వహించిర్రు.. ఈ సమావేశాలల్ల మస్తు మంది రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమ కారులు పాల్గొన్నరు. ఈ సమావేశాలల్ల విగ్రహ రూపం గురించి చర్చ .. తెలంగాణ తల్లి అంటే ఎనక బడ్డ ప్రాంతానికి గుర్తుగా ప్యాద మహిల రూపంల ఎందుకు ఉండాలె? అని ప్రశ్నలు అచ్చినయ్.
తెలంగాణ ఎప్పటికి గిట్లనె ఎనుకబడి ఉండదు గద..? పత్తేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగ, దేశంలనే సంపన్న రాష్ట్రంగ, బంగారు తెలంగాణగ మారుతుంది అనే నమ్మకంతోని.. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితోని రూపొందించిన భారతమాత చిత్రాన్ని తలపించేతత్తు.. తెలంగాణ తల్లికి రూపమివ్వాలె అని ఆ సమావేశంల పాల్గొన్న శానమంది తెలంగాణ వాదులు సూచించిర్రు. దానికికి దగ్గట్టు ప్రొఫెసర్ గంగాధర్ గిప్పుడున్న తెలంగాణ తల్లికి రూపమిచ్చిర్రు.
తెలంగాణల ప్రత్యేకతలను తెలంగాణ తల్లి రూపకల్పనలో జోడించుకుంత తీర్మానించిర్రు. అయన్ని గల్పుకుంతు బీఎస్ రాములు డిజైనింగ్ రూపాన్ని సూచించిర్రు.
గట్ల తెలంగాణ సంస్కృతికి చిహ్నంగ ఒక షేతిల బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి జూపిచ్చే పట్టుషీర, కరీంనగర్ ఎండిడి మట్టెలు, మెట్ట పంటలకు నిషానగ మక్క కంకులు, భరతమాత ముద్దు బిడ్డగా, రాజమాతగా నెత్తిమీద అందమైన కిరీటం, గా కిరీటంల పేమస్ కోహినూర్ డైమండ్, ఒడ్డానం, జరీ అంచుషీర, నిండైన కేశ సంపద గియ్యన్నిటితోని మెరుగులు తీర్సిదిద్దిన్రు.. గిట్ల తెలంగాణ తల్లి రూపకల్పనల మస్తు చారిత్రక, సాంస్కృతిక విశేషాలు గా విగ్రహంల తెలంగాణ ఉద్యమ సమయంల ఊల్లల్ల వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించుకుని గొప్ప స్ఫూర్తిని పొందిర్రు తెలంగాణవాదులు.
కేసీఆర్ నిషానాలు లేకుండా జేత్త అని జెప్పి తెలంగాణ ఉద్యమ నిషానాలు లేకుండ జేసే ప్రయత్నం జేసుడు గాదా?. తెలంగాణ తల్లిని మార్సేటందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, గీతాన్ని, రూపాన్ని మార్సినంత మాత్రంతోని తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తీసేయ్యగల్గుతరా?. తెలంగాణ చరిత్రల ఆయన స్థానం ఆయనకు ఉండదా?
దేశంల ఏ పార్టీ అధికారంలోకి అచ్చినా గుడ భారతమాత విగ్రహం రూపు మారుతదా?. పక్కన ఆంధ్రప్రదేశ్‌ల ఏ పార్టీ అధికారంల ఉన్నా తెలుగు తల్లి విగ్రహం మార్సరు. మరి గసుతప్పుడు తెలంగాణల అధికారంలోకి కాంగిరెస్సు అచ్చింది గాబట్టి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్సాలనుకోవడం ఏందొ మల్ల.
కొత్త విగ్రహం కళా విహీనంగా, షిన్న షిన్న నగలతోని, షేతిల బతుకమ్మ లేకుండా, కిరీటం లేకుండా ఉన్నది. మీదికెంచి షెయ్యిని జూపిచ్చుకుంత.. కాంగిరెసు పార్టీ హస్తం గుర్తును ప్రచారం జేస్తున్నట్లు ఉందని అనుకుంతున్నరందరు.. ఎన్నికల కోడ్ అత్తె గీ కొత్త రూపంలో ఉన్న హస్తం గుర్తు తోని గీ విగ్రహాలకు ముసుగు వేసే ప్రమాదం కూడా ఉండొచ్చు.
ఒక్కల్ల మొండి పట్టుదలతోని, తెలంగాణ సమాజంల ఒవ్వల్లతోని మాట్లాడ్కుండ, ఒవ్వల్లనడ్గకుండ తయారు జేపిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడం కరకుటేనా? తెలంగాణ తల్లి మిగతా అందరు తల్లుల లాగానే సిరిసంపదల ప్రతీకగా ఉండాలే దప్ప ప్యాదగా ఉండగూడదు. గిది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అయితది.. ఆంధ్ర ప్రాంత నాయకుల కనుసన్నులల్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర నిషానాలు లేకుండ జేసే ప్రయత్నం జరుగుతుంది. గానాడు ఉద్యమంల పాల్గొన్న ఎంతమంది మేధావులు, రాజకీయ నాయకులు గిప్పుడున గవుర్మెంటుల గుడ ఉన్నరాయె. దురదృష్టం ఏదంటే ఆలు గుడ ఉద్యమ చరిత్ర రూపు మాపే ప్రయత్నంల బాగస్వామ్యం గావడం. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గ తెలంగాణ ఉద్యమాన్ని ముందరుండి నడిపించిన ప్రొ కోదండరాం సారు గీ ప్రయత్నాన్ని ఆపకుండా ఒత్తాసు పలకడం నిజంగా సోచనీయం.
కేసీఆర్ సారును ఓడగొట్టి రేవంత్ సారును కుర్జీలో కూచోబెట్టింది తెలంగాణ ఉద్యమ చరిత్ర నిషానాలు జేరిపేయనికి కాదు. పజల కోసం మంచి జేస్తాడని. కాబట్టి రేవంత్ సారు గిప్పటికైనా గిలాంటి పనులు మానుకొని పబ్లిక్ కోసం పనిజేస్తే మంచిది.