తెలంగాణాకు తల్లి రూపంలో విగ్రహం ఉండాలి కానీ, దేవత రూపంలో కాదన్న భావనతోనే ఈ విగ్రహం రూపొందించామంటున్న రేవంత్ కొత్త విగ్రహ రూపంపై విపక్షంతో పాటు రచయితల సంఘం అభ్యంతరాలు. అభయ హస్తం ముద్ర కాంగ్రెస్ ఎన్నికల గుర్తును పోలివుందన్న బీజేపీ. చేతిలో బతుకమ్మ లేకపోవడంపై అసెంబ్లీలో బీజేపీ ఆగ్రహం.. పోటీగా మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ… ఇలా అన్ని ఒక్క రోజులోనే (డిసెంబర్ 9న) జరిగిపోయాయి..
భావన కాదు భావోద్వేగం.. తెలంగాణ అస్థిత్వానికి చిహ్నం.. బతుకమ్మ లేకుండా విగ్రహం.. తెలంగాణ తల్లిపై రాజకీయ లొల్లి.. తల్లి ఎలా ఉండాలి? అమ్మ ఆహార్యం ఎలా కనిపించాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విగ్రహం చుట్టే జరుగుతోంది చర్చ. ప్రభుత్వాలు మారితే పాత పథకాల్లో కొన్ని ఆగిపోతాయి. కొత్త పథకాలు తెరపైకొస్తాయి. కానీ అధికారం మారగానే సంస్కృతీ సంప్రదాయాలు మారిపోతాయా, ఆత్మగౌరవ అంశాలు తెరపైకొస్తాయా అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కొత్త రూపురేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర పాలనాకేంద్రంలో ఆవిష్కరించడంపై రాజకీయ రచ్చతో పాటు భావోద్వేగ చర్చ జరుగుతోందిప్పుడు.
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి నిలువెత్తు రూపం కొలువుదీరింది. 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్‌ఎస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టమన్నట్లే ప్రతిస్పందించింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. లక్ష మంది మహిళల సమక్షంలో గ్రాండ్‌గా విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముందే అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం నాలుగుకోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాగా, నిండుతనంతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు సీఎం. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టూబొట్టుతో, గుండు పూసలు, హారం, ముక్కుపుడకతో చేతులెత్తి మొక్కేలా తల్లి ఆకృతిని తీర్చిదిద్దామన్నారు. ఆకుపచ్చ చీర , కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి ప్రతిమకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందన్నారు సీఎం..
బీఆర్‌ఎస్ హయాంలో రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలకు దగ్గరగా ఉందని ఆక్షేపిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా.. సాధారణ మహిళలా, పోరాట స్ఫూర్తిని చాటేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని అధికారంలోకి రాగానే చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లికి రూపమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు తల్లి స్థానంలో తమ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటయ్యాయి.
బీఆర్ఎస్ వాదన ఇదే..
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు ఉండేవి. కోహినూర్ వజ్రంతో కిరీటంతో పాటు వడ్డాణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో తీర్చిదిద్దారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విగ్రహం రూపురేఖల్లో మార్పులుచేర్పులు చేశారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలున్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు. అయితే ఇందులో బతుకమ్మ కనిపించలేదు.
విగ్రహ నమూనా బయటికొచ్చినప్పటి నుంచే ఇది తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రని వాదిస్తూ వచ్చింది బీఆర్‌ఎస్. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తోంది విపక్షపార్టీ. తెలంగాణ తల్లిని పేదరికంతో చూపించే ప్రయత్నం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వాదిస్తోంది బీఆర్‌ఎస్. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రముఖ కవి, రచయిత జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మార్చకుండా చూడాలని కోరారు.
విగ్రహావిష్కరణ కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లని కూడా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరితో పాటు కవులు, కళాకారులకు ఆహ్వానాలు పంపించింది. అయితే మొదట్నించీ విగ్రహ మార్పుని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్.. ఈ భావోద్వేగ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. కేసీఆర్‌పై కుట్రతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారంటోంది బీఆర్‌ఎస్. కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ దగ్గర నిరసనకు దిగారు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు. ఫాంహౌస్‌లో పార్టీనేతలతో భేటీలో విగ్రహమార్పుపై స్పందించారు కేసీఆర్. ఇది మూర్ఖపు చర్యన్న బీఆర్‌ఎస్ అధినేత ప్రభుత్వ చర్యని వ్యతిరేకించాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓపక్క ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగానే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని పునరావిష్కరించింది బీఆర్‌ఎస్.
ఇప్పటిదాకా అసలు రూపమే లేదు. ఇక మార్చిందెక్కడ అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ తల్లికి ఇంతవరకూ అధికారికంగా ఒక రూపాన్ని ఇవ్వలేదంటోంది అధికారపక్షం. బీఆర్ఎస్ భవన్‌లో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఉద్యమ సమయంలో తీర్చిదిద్దారని, అయితే ఆ విగ్రహ నమూనాని అధికారికం చేయలేదని, పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రతిష్టించే ప్రయత్నం చేయలేదంటోంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అధికారికంగా లేదనేది సర్కారు వాదన. అసెంబ్లీలోనూ ఇదే వాదన బలంగా వినిపించారు మంత్రులు.
బతుకమ్మ ఉంటే బాగుండేది..
అధికారికం సంగతి పక్కనపెడితే దశాబ్దకాలంగా ప్రజల మనసుల్లో ముద్రపడ్డ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్. బతుకమ్మని తీసేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టారని విపక్షపార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే నిండుగా ఉండేదని బీజేపీ కూడా అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలోని సగటు మహిళని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దామంటున్న ప్రభుత్వం.. విపక్షాల వాదనను కొట్టిపారేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విగ్రహంపైనా బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని ఆవిష్కరణ సందర్భంగా సీఎం మండిపడ్డారు.
5కోట్ల 30లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ తల్లి కొత్త కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపుదిద్దింది. విగ్రహం ఎత్తు 17 అడుగులు, కిందిగద్దె మరో మూడు అడుగులతో మొత్తం 20 అడుగుల ఎత్తున రూపొందించారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కవులు, ప్రజాసంఘాలనుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ తల్లితోనే మొదలుకాలేదు వివాదం. జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసినప్పుడు కూడా బీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. టీఎస్‌ని టీజీగా మార్చడం కూడా వివాదాస్పదమైంది. రాష్ట్ర సంస్కృతిని చాటాల్సిన విగ్రహం, పాటల విషయంలోనూ వివాదాలపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు.
మళ్ళీ అధికారంలో వస్తే..
మళ్ళీ అధికారంలో వస్తే ఒక్క మహాత్మా గాంధీ పేరు తప్ప అన్ని గాంధీల పేర్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్న బీఆర్‌ఎస్. తల్లి విషయంలో కాదు. కొత్త రాష్ట్రంలో వరుసగా ఏర్పడిన రెండు ప్రభుత్వాలు… రెండు భిన్నమైన ఆలోచనలతో సాగుతున్న వ్యవహారం. తెలంగాణాని TS నుంచి TG మార్పడం, రాష్ట్ర గీతాన్ని గుర్తించడం. తల్లి విగ్రహాన్ని మార్చడం ఇలా ప్రతి అంశంలోనూ భిన్నమైన వాదనలు వినిపించింది..
తెలంగాణ తల్లి విషయంలోనే కాదు.. తెలంగాణ భావోద్వేగాలతో ముడిపడ్డ ప్రతీ విషయంలోనూ సెంటిమెంట్ మళ్లీ తెరపైకొస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందంటోంది కాంగ్రెస్. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పిదాలను సరిచేస్తున్నామంటోంది. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడానికి ముందే.. తెలంగాణ సమాజంపై ప్రభావం చూపే కొన్ని కీలకాంశాలపై తనదైన ముద్రవేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిని బీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. తాము అధికారంలోకొచ్చాక మారుస్తామని హెచ్చరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. భావోద్వేగాలతో రాజకీయం చేసిన బీఆర్‌ఎస్.. తెలంగాణ సమాజం ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదంటోంది కాంగ్రెస్. తాము అధికారంలోకొచ్చాకే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామంటోంది. జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించిన సమయంలో కూడా విపక్షాలనుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులతో జూన్2 ఆ పాటను విడుదల చేసింది.
జయజయహే తెలంగాణ
జయజయహే తెలంగాణ పాటలో పది జిల్లాల తెలంగాణ అనే పదం స్థానంలో పద పదాన అని చేర్చారు. ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి.. అంటూ పాత పాట ముగుస్తుంది. రాష్ట్రం సిద్ధించటంతో ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అని కొత్త పాటలో ముగింపు వాక్యాన్ని చేర్చారు. నవాబులు అనే పదం స్థానంలో భాగ్యనగరి పదాన్ని చేర్చారు. ఫుల్ వెర్షన్ కోసం అందెశ్రీ కొత్త చరణాలు రాశారు. ఇందులో తెలంగాణ కవుల ప్రాశస్త్యాన్ని వివరించారు. కీరవాణి స్వరకల్పనతో పదమూడున్నర నిమిషాల నిడివితో రాష్ట్ర అధికారిక గీతాన్ని తీర్చిదిద్దారు అందెశ్రీ. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో ఆలపించేందుకు రెండున్నర నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందించారు.
టీఎస్‌ని.. టీజీగా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెలంగాణ రాష్ట్ర సంక్షిప్తరూపం టీఎస్‌ని.. టీజీగా మార్చేసింది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. 2014లోనే టీజీగా పెట్టాలని అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర సంస్థలకు టీఎస్ అని పెట్టాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షిప్తరూపం టీజీగానే ప్రజల్లో విస్తృతంగా ప్రచారమైంది. అందుకే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ దీనిపై నిర్ణయంతీసుకుని ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంది.
తెలంగాణ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ లోగోను సిద్ధంచేసింది. చార్మినార్, కాకతీయ కళాక్షేత్రాలను తొలగిస్తున్నారన్న ప్రచారంతో పాటు.. కొత్త రాజముద్రపై తీవ్ర చర్చ జరిగింది. విపక్షపార్టీ అభ్యంతరాలతో పాటు వివిధ వర్గాల నుంచి కొన్ని సూచనలతో ప్రస్తుతానికి పాత చిహ్నాన్నే కొనసాగిస్తోంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలు, పాత పథకాల విషయంలోనూ అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు భిన్నమైన వైఖరితో ముందుకెళ్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా కొనసాగించిన స్కీమ్‌ల స్థానంలో కొత్త పథకాలు తెరపైకొస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో వరుసగా ఏర్పడ్డ రెండు ప్రభుత్వాల పాలనతీరు పూర్తి భిన్నంగా ఉందన్న చర్చ నడుస్తోంది.
ఏ రాష్ట్రానికైనా రాష్ట్ర గీతం ఒకటే ఉంటుంది. ఆరాధించే తల్లి ఒకటే ఉంటుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి సీన్ మారుతోంది. మీ తల్లి మీదే.. మా తల్లి మాదే. మీ గీతం మీదే.. మా గీతం మాదే అన్నట్లుంది పరిస్థితి. తమ హయాంలో రూపుదిద్దిన విగ్రహమే అసలు సిసలు తెలంగాణ తల్లి అని వాదిస్తోంది బీఆర్‌ఎస్. జయజయహే తెలంగాణ పాటని ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించినా.. పాతపాటనే ఆలపిస్తామంటోంది బీఆర్‌ఎస్. టీజీని కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ అంటుంటే.. అధికారంలోకి రాగానే మళ్లీ టీఎస్‌గా మారుస్తామంటోంది బీఆర్‌ఎస్. పదేళ్ల తర్వాత కూడా తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతంపై ఎడతెగని పంచాయితీపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఉద్యమకారులు అసహనంతో ఉన్నారు. దీనికి ముగింపు ఎప్పుడో?..