తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గట్టి హెచ్చరిక చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇదే వాతావరణం శనివారం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అప్రమత్తం చేసింది.
రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా శనివారం ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 5 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోవచ్చని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అప్రమత్తం చేసింది.
కాగా బుధ, గురువారాల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, మెదక్, సంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ఎముకలు కొరికే చలితో జనాలు తెగ ఇబ్బందిపడుతున్నారు.
చలిగాలులు తీవ్రంగా ఉండనుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని, ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని సూచించింది.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని అప్రమత్తం చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ ప‌ల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా వాతావరణం ఉంటుందని తెలిపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here