విజయనగరం జిల్లాలో ఓ మహిళ హాష్టల్ వార్డెన్ మద్యం సేవించి బాలికల పట్ల వికృత చేష్టలకి దిగి చివరికి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురైంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.
నీరజాకుమారి అనే మహిళ గత మూడు ఏళ్ల క్రితం కొత్తవలస బిసి బాలికల వసతి గృహంలో హాష్టల్ వార్డెన్‌గా జాయిన్ అయ్యింది. ఆమె జాయిన్ అయిన దగ్గర నుండి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానే ఉండేది. బాలికల హాష్టల్ వార్డెన్‌గా ఉన్న నీరజాకుమారి హాస్టల్‌లో ఉన్న బాలికలకు తల్లిగా వ్యవహరించాల్సింది పోయి నరకం చూపిస్తుండేది. బాలికలతో హాష్టల్ క్లీనింగ్‌తో పాటు బాత్రూమ్స్ సైతం క్లీన్ చేయించేది. అంతేకాకుండా నీరజాకుమారి బట్టలు సైతం రోజుకొక బాలిక ఉతకడం తప్పనిసరి. ఈమె ఆగడాలు అంతటితో ఆగకుండా హాస్టల్‌లో విద్యార్థులు చూస్తుండగానే మద్యం సేవించేది. మందు కొడుతున్న సమయంలో కావలసిన స్నాక్స్ సైతం బాలికలే అందించక తప్పని పరిస్థితి ఉండేది. విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన పసివయస్సులో కళ్ల ముందే మద్యం సేవిస్తున్న వార్డెన్ చూస్తూ కాలం గడిపేవారు బాలికలు. అదిలా ఉండగా మద్యం సేవించిన తర్వాత మత్తులో బాలికలను చావచితక కొట్టేది. ఎవరైనా బయటికి చెప్తే హాస్టల్ నుంచి పంపించేస్తానని బెదిరించేది. అందరూ పేద బాలికల కావడంతో చేసేదిలేక లోలోన కుమిలిపోయేవారు.
వార్డెన్ నీరజకుమారి ఆగడాలు ఇలా ఉండగా ఈమెతో పాటు ఈమె భర్త కూడా హాస్టల్‌లోనే ఉంటూ అక్కడే మద్యం సేవించేవాడు. బాలికల వసతి గృహంలోకి మగవారు రాకూడదన్న నిబంధన పక్కన పెట్టి మరి అక్కడే నివాసం ఉంటూ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండేవాడు. నీరజాకుమారి, ఆమె భర్త వేధింపులు భరించలేక తల్లిదండ్రుల సహాయంతో బాలికలు కొత్తవలస పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆమెపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హస్టల్‌లో ఉన్న నీరజాకుమారి దాచి ఉంచిన మద్యం బాటిల్‌ను పోలీసులకు అందజేశారు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ వికృత చేష్టలకు పాల్పడిన హాస్టల్ వార్డెన్ నీరజాకుమారిపై సస్పెన్షన్ వేటు వేశారు.