కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్లు ప్రకటించినప్పటికీ.. కడప జిల్లాలో ఎన్నికల హింసకు వైసీపీ నేతలు తెగబడే అవకాశా లున్నా యన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా శనివారం (డిసెంబర్ 14) హౌస్ అరెస్టు చేశారు. అంతకు ముందు శుక్రవారం డిసెంబర్ 13) కూడా పోలీసులు ఆయనను వెంటాడారని అవినాష్ రె్డి అనుచరులు చెబుతున్నారు. ఒక దశలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుంటారని అంతా భావించారు. అయితే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని పోలీసులు వెంటాడుతున్నారా అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించినప్పటికీ కడప జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆధిపత్య ప్రదర్శనకు దిగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేవలం వైసీపీకి చెందిన రైతులకు మాత్రమే నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదంటూ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు తహశీల్ దార్ కార్యాలయాలను ముట్టడిస్తున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ హౌస్ అరెస్టు జరిగింది. శుక్రవారం (డిసెంబర్ 13) రాత్రి పొద్దుపోయిన తరువాత నుంచీ అవినాష్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం (డిసెంబర్ 14) ఉదయమే అవినాష్ తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయనను బయటకు రానీయకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.