అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగిసింది. ఈ సీజన్ విజేతగా నిఖిల్ నిలిచాడు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్ హాజరై, విజేతలకు ట్రోఫీతో నగదు బహుమతిని ప్రదానం చేశారు.
విజేతగా నిలించిన నిఖిల్‌కు రూ.54 లక్షల నగదు బహుమతితో పాటు మారుతి సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారు అందించారు. ఇప్పటివరకూ జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ఇదే అతి పెద్ద ప్రైజ్ మనీ అని హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించారు.
ఆ తర్వాత విజేత నిఖిల్ మాట్లాడుతూ, “అందరికీ ధన్యవాదాలు. హౌస్‌మేట్స్‌తో అద్భుతమైన జర్నీ కొనసాగింది. చాలా మంది నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిలిచారు. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నా. నేను మీ అందరిలో ఒకడిని. నన్ను ప్రేమించి, ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను బయట వ్యక్తి కాదు, మీ ఇంటి వాడినని నన్ను గెలిచిపించినందుకు థ్యాంక్యూ. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో కొనసాగుతా. ఈ ట్రోఫీ అమ్మకు అంకితం చేస్తున్నా” అని విజేత నిఖిల్ చెప్పుకొచ్చాడు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ, “105 రోజుల పాటు హౌస్ కొనసాగడం మామూలు విషయం కాదు. ఒక 10 రోజుల సినిమా షూటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్తే, ఇంట్లో వాళ్లను గుర్తు చేసుకుంటూ ఉంటాం. మీ జర్నీ చూస్తుంటే, నా కూతురు గుర్తుకొచ్చి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. ధైర్యంగా ఇక్కడ ఉన్నారంటే మీరంతా విజేతలే. నిఖిల్ భవిష్యత్‌లో మరింత రాణించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
అంతకుముందు రన్నరప్ గౌతమ్ కూడా మాట్లాడాడు. ‘ఇక్కడి వరకూ తీసుకొచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అమ్మానాన్న.. విన్నర్‌ను కాలేకపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. నా జీవితంలో వేసే ప్రతి ఒక్క అడుగూ మీరు గర్వపడేలా ఉంటుంది’ అని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here