నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలో ఏడో తరగతి చదువుతున్న బాలుడు హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనూ ఈ విద్యా సంస్థకు చెందిన పలు స్కూళ్లలో విద్యార్ధులు ఇదే మాదిరి తనువు చాలించారు. ఇక్కడి టీచర్ల చదువు ఒత్తిడి పసి పిల్లల నిండు ప్రాణాలను తీస్తుందని, ఇకనైనా ప్రభుత్వం కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివే ఏడో తరగతి విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబం పాఠశాల వద్ద నిరసనకు దిగింది. బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‎లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‎లో లోహిత్ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా లోహిత్ చదువులో అంతగా ప్రతిభ కనబరచడం లేదు. ఇదే విషయాన్ని స్కూల్‌ టీచర్లు బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. ఇక బాలుడు కూడా ఆ స్కూల్లో చదవలేకపోతున్నానని కన్నోళ్లకు చెప్పడంతో.. వారు సర్దిచెప్పి మళ్లీ స్కూల్‌కు పంపారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. సోమవారం హోస్టల్ గది‎లో ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. గదిలో ఎవరూ లేని సమయంలో రూమ్‌లోని ఫ్యాన్‎కు ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు తలుపులు ఎంతకీ తీయకపోవడంతో వెంటనే హాస్టల్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, హాస్టల్ సిబ్బంది గది తలుపులు పగలగొట్టి చూడగా.. ఇప్పటికే లోహిత్ విగతజీవిగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించాడు.

పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న లోహిత్ కుటుంబ సభ్యులు విద్యార్ధి సంఘాల నాయకులతో కలిసి స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలు పోసి స్కూలుకు పంపింతే.. నా కొడుకు శవాన్ని గిప్టుగా ఇచ్చారంతూ తల్లిదండ్రులు రోదించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపులు వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా తన కొడుకు చనిపోయిన విషయాన్ని ఆలస్యంగా చెప్పారని కన్నీరుమున్నీరయ్యారు. చదువు విషయంలో తన కుమారుడిని ఒత్తిడి పెట్టొద్దని గతంలోనే టీచర్లకు చెప్పామని, ఈ స్కూల్లో చదువు ఒత్తిడి మాత్రమేకాకుండా తమకు తెలియంది ఏదో జరుగుతుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇది ఆత్మహత్యా, లేదా ఎవరైనా దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here