విపక్షాల ఆందోళనలతో అసెంబ్లీ సమావేశాలు హీటెక్కాయి. లగచర్ల లడాయితో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ షేక్ అయ్యాయి. అప్పులపై హరీశ్‌రావు, భట్టివిక్రమార్క మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కక్ష సాధింపు చర్యలను ప్రజలను హర్షించరంటున్నారు బీఆర్ఎస్ నేతలు..
అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ల హోరు కొనసాగింది. అప్పులపై హరీశ్‌రావు-భట్టి మధ్య మాటల యుద్దమే జరిగింది. లగచర్ల రైతుకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీలో కూడా లగర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభలో దుమారం రేపారు. అరెస్ట్ అయిన లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ తీరుపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్‌కు లేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎంతో మంది రైతులకు బేడీలు వేశారన్నారు మంత్రి సీతక్క. లగచర్ల ఘటనలో అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసిన ఘటనలను ప్రస్తావిస్తూ అప్పటి ఫోటోలు చూపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అంతకు ముందు క్వశ్చన్ అవర్‌లో అప్పులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 27 వేల 208 కోట్ల అప్పు చేసిందన్నారు హరీశ్‌రావు. ఎఫ్ఆర్‌బీఎం కింద 51 వేల 277 కోట్ల అప్పు తెచ్చిందన్నారు. అప్పుల పరంపరం ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే రూ. 6 లక్షల 36 వేల కోట్ల అప్పు అవుతుందన్నారు హరీశ్‌రావు. తాము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. ఈ విషయంపై ప్రత్యేక డిబేట్ పెడదామన్నారు.
అప్పులపై ఆర్థిక మంత్రి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు హరీశ్‌రావు. అప్పులు, వడ్డీలపై హరీశ్ అబద్ధాలు ఆడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు యూనివర్సిటీల చట్టసవరణ బిల్లు.. జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ నిరసనకు దిగింది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. కౌలు రైతులకు రుణాలు, పట్టాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది.
అసెంబ్లీలో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారం:
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు బాధ్యులపై చర్యలుంటాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనన్నారు పొంగులేటి. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వారికీ వీరికి కాదు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధమన్నారు కేటీఆర్. ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు జగదీశ్ రెడ్డి. ఈ- కార్ రేసింగ్ వ్యవహారంలో సభలో చర్చపెడితే కేటీఆర్ సమాధానం చెప్తారన్నారాయన. ఈ సందర్భంగా పొంగులేటి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఎమ్మెల్యే వివేకానంద. బీఆర్ఎస్ లీడర్ల కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. కేటీఆర్‌ను జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కక్ష సాధింపు చర్యలను ప్రజలను హర్షించరంటున్నారు బీఆర్ఎస్ నేతలు.