తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్ధులు హాజరయ్యారు. అయితే గతంలో పోల్చితే ఎన్నడూలేని విధంగా ఈ సారి గ్రూప్ 2కి అభ్యర్ధులు భారీగా గైర్హాజరయ్యారు..తెలంగాణ రాష్ట్రంలో సోమవారంతో గ్రూప్‌ 2 పరీక్షలు ముగిశాయి. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి రెండు రోజుల పాటు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబరు 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే సాధారణంగా గ్రూప్‌ 2 పరీక్షకు గణనీయమైన పోటీ ఉంటుంది. దరఖాస్తు సమయంలో కూడా దాదాపు ఐదున్న లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ పరీక్షకు మాత్రం కనీసం సగం మంది కూడా హాజరుకాలేదు.

 

డిసెంబర్‌ 15 (ఆదివారం) జరిగిన పేపర్‌ 1 పరీక్షకు 2,57,981 మంది అంటే 46.75 శాతం మంది, పేపర్‌ 2 పరీక్షకు 2,55,490 మంది అంటే 46.30 మంది పరీక్ష రాశారు. ఇక డిసెంబరు 16న ఉదయం జరిగిన పేపర్‌ 3 పరీక్షకు 2,51,738 (45.62 శాతం) మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 4 పరీక్షకు 2,51,486 (45.57 శాతం) మంది హాజరయ్యారు. పేపర్‌ 3 (ఎకానమీ) కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ పేపర్‌లో కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్‌లు, సర్వేలు, పంటలు, జనాభా లెక్కలు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రెవెన్యూ లోటు, జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయని అభ్యర్ధులు తెలిపారు.

ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 4 (తెలంగాణ ఉద్యమం, చరిత్ర) పరీక్షలో తెలంగాణ తల్లి విగ్రహంపై సహా తెలంగాణ ఉద్యమం, కమిటీలు, ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు, ఉద్యమ గేయాలు, రైతు ఉద్యమాలు, నిజాం పాలన, విప్లవ సంస్థలు, ఎన్టీఆర్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఉద్యమంలో కేసీఆర్, సోనియాగాంధీ, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ పాత్రలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. అన్నింటికన్నా పేపర్‌ 4 పరీక్ష సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here