సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు. ఆ సందర్భానికి అది పెద్దగా తప్పని అనిపించకపోయినా మరుసటి రోజు లేదా కొన్ని రోజుల తరువాత ఆలోచిస్తే అది చాలా అవమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా సరదా పేరుతో అనే కొన్ని మాటలు ఒకసారి అయితే సరదాగానే ఉంటుంది. కానీ పదే పదే ఆ మాటను అనడం లేదా పదే పదే అదే విధంగా ప్రవర్తించడం చేస్తుంటే అది అవమానించడం అవుతుంది.  ఇలా సరదా మాటున జరిగే అవమానాన్ని చాలామంది పంటి బిగువున భరిస్తుంటారు.  కొందరు అదే పనిగా సరదా అనే ఒక తెరను అడ్డు పెట్టుకుని మరీ మనుషుల్ని నొప్పిస్తుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా.. సరదా పేరుతో మిమ్మల్ని ఇతరులు పదే పదే అవమానించకూడదు అన్నా కింద చెప్పుకునే విధంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలి.

ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే లేదా ఏదైనా వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే, మీరు ఆ స్థలంలో ప్రశాంతంగా ఉండాలి . వెంటనే రియాక్ట్ కాకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి  ఏమి చెబుతున్నాడో,  ఎందుకు చెబుతున్నాడో  పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరైన సమయం వచ్చినప్పుడు, ఆ ప్రశ్నకు మర్యాదగా, ముక్కుసూటిగా  సమాధానం ఇవ్వాలి. తాము అనే మాటలకు సమాధానం వస్తుంటే ఇంకోసారి అలా అనే సాహసం చెయ్యరు చాలావరకు.  కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సున్నితంగానే చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి.

చాలా సార్లు ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు,  మిమ్మల్ని దూషించినప్పుడు. ఎవరైనా మిమ్మల్ని ఇతరుల ముందు అవమానించిన ప్రతిసారీ  రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. సమాధానం ఇవ్వడం కరెక్ట్ అనుకుంటారు కానీ.. ఎదుటి వారు అన్న మాటలకు అప్పటికే మనసులో కోపం పుట్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది వక్తి  మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు తర్కం,   ఆలోచనాత్మకత మరచిపోతుంటారు.  కాబట్టి వెంటనే రియాక్ట్ కాగండి.

ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే వెంటనే ఫీలైపోనక్కర్లేదు.  ఫీలవుతూ కోపంగా రియాక్ట్ అవ్వడం కంటే  నవ్వుతూనే చురకలు అంటించడం మంచిది. ఇలా చేస్తే ఇంకోసారి మీ జోలికి రాకుండా ఉంటారు.. ఇతరులు ఎలాగైతే సరదా పేరుతో మిమ్మల్ని  అంటున్నారో మీరు అదే సరదా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సరదాకు కాస్త చిరునవ్వు కూడా జోడించాలి.

ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నా,  పదే పదే అవే సంఘటనలు ఎదురవుతున్నా  ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇతరులు అన్న విషయాన్ని చెడ్డ పదజలాంతో కాకుండా మర్యాదపూర్వకంగా ఉండే మాటలతోనే గట్టి సమాధానం చెప్పాలి. ఇలాచేస్తే మీరు చెప్పేది తప్పని ఎవరూ అనరు.  మర్యాదగానే మాట్లాడారనే మార్క్ మీకు ఉంటుంది.  మిమ్మల్ని అవమానించిన వారికి సమాధానం చెప్పామనే తృప్తి మీకూ ఉంటుంది.

ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, అర్థం చేసుకోకున్నా అది మీ తప్పు కాదు, ఎదుటివారి తప్పు. ఎవరో ఏదో అనగానే మీరు తప్పేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.  మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రపంచంలోని ఎంకరేజ్ చేసేవారికంటే.. ఎగతాళి చేసి వెనక్కు లాగడానికి ట్రై చేసే వారే ఎక్కువ మంది ఉంటారని, మనుషుల్ని బాధపెట్టడానికే ముందుకు వస్తారని గుర్తుంచుకోవాలి. అలాంటివారి మాటలను వదిలిపెట్టి  ముందుకు వెళ్లడమే అందరూ చేయాల్సిన పని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here