** కేసీఆర్ రావాలి? కేసీఆర్ సలహాలు ఇవ్వాలి.. సిఎం, మంత్రులు
** కేసీఆర్ ఎందుకు రావాలి? అధికారం ఇచ్చింది కాంగ్రెస్ కే కదా!
** కేసీఆర్ ని గౌరవ ముఖ్యమంత్రిని చేసి.. రేవంత్ ని వర్కింగ్ సిఎం చేయండి..
కెసిఆర్ అసెంబ్లీ కి రావాలి. కేసీఆర్ బయటకు రావాలి. కేసీఆర్ నువ్వు బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలంటే నీకు చులకనా? ఓట్లు వేసి నిన్ను ఎంఎల్ఏగా గెలిపిస్తే నువ్వు రావా? ఈ మాటలు తరచూ గత సంవత్సర కాలంగా మనం వింటూనే ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సో కాల్డ్ మేధావులు, కొంతమంది జర్నలిస్టులు అందరూ అనే మాట కేసీఆర్ బయటికి రావాలి. కేసీఆర్ అనావాళ్ళు లేకుండా చేస్తా… కేసీఆర్ అనే కలుపు మొక్కను మళ్ళీ మొలవనివ్వను అని సిఎం రేవంత్ రెడ్డి అన్న మాట. కానీ అదే రేవంత్ రెడ్డి ప్రతి రోజు ప్రతి సభలో, ప్రతి ప్రెస్ మీట్ లో కేసీఆర్ పేరు ఎత్తనిదే ముగించడు.
‘కేసీఆర్’ ఈ మూడు అక్షరాలు గత 20 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో మారుమోగుతూనే ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడినా న్యూసే, అసలు మాట్లాడకుండా మౌనంగా ఉన్న న్యూసే. అలాంటి కేసీఆర్ గత ఎన్నికల్లో ఒడిపోయాక తుంటి ఎముక విరగడంతో రెస్ట్ తీసుకొని పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. దాంతో నిరాశ చెందిన కేసీఆర్ తన ఫారం హౌస్ కే పరిమితం అయ్యాడు. అప్పటినుండి ప్రతి రోజు ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు, ఎంఎల్ఏలు, కాంగ్రెసు అనుకూల మీడియా అందరూ కేసీఆర్ బయటకు రావాలి అనే అంటున్నారు.
అసలు కేసీఆర్ ఎందుకు బయటకు రావాలి? ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. వీళ్ళు మరిచిపోతున్నట్టున్నారు ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకు వివరంగా చెప్పాడు. ‘‘నేను క్లియర్గా చెబుతున్నా.. నాకు డెబ్బయి సంవత్సరాల వయసొచ్చింది.. నాకు జీవితంలో ఇంకా ఏం కావాలి? తెలంగాణ తెచ్చాననే పేరే నాకు ఆకాశమంత పెద్దది. అయినా మీరు మన్నించి ఇచ్చిన్రు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన . నాకన్నా ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు. నేను ఇవాళ కొట్లాడేది, పదవి కోసం కాదు. పేదరికం లేని తెలంగాణ కావాలి.. కేరళ రాష్ట్రం మాదిరిగా వంద శాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలి. సమృద్ధిగా పంటలు పండి, రైతాంగం గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయే తెలంగాణ కావాలి. తెలంగాణలోని సాగుభూముల్లో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. ఇదీ నా పంతం! దయచేసి మీకు విజ్ఞప్తి చేసేదొక్కటే. పార్టీల వైఖరి, నాయకుల ఆలోచనా సరళి.. అన్నీ ఆలోచించి ఓట్లేయాలి తప్ప. ఆగంకావొద్దు. మీరు నన్ను ఓడగొడితే నాకు పోయేదేమీ లేదు… మీ బతుకులే ఆగమయితాయి. నన్ను ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే… నా ఫామ్ హౌస్ కి పోయి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా.. కానీ మీ బతుకులే ఆగమవుతాయి ఆలోచించి ఓటేయండి” అని చెప్పాడు. కానీ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి కేసీఆర్ ని ఓడగొట్టారు. దాంతో కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమిత అయ్యాడు.
క్షేత్ర స్థాయిలో కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తున్నారు. అనుక్షణం ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తున్నారు. కానీ ఎక్కడో వెలతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుందని సామాన్య ప్రజలు, మెదవులు, జర్నలిస్టులు నమ్ముతున్నారు. గత ఎండకాలంలో మేడిగడ్డ బ్యారేజి కుంగిదనీ కాళేశ్వరంని ఎండబెట్టి రైతుల పొట్టకొట్టింది రేవంత్ సర్కారు. ఆ సమయంలో కేసీఆర్ ఒక్క మాట అనేసరికి వెంటనే రాజరాజేశ్వరీ, రంగనాయక సాగర్ రిజర్వాయర్ లను నింపింది ప్రభుత్వం. అది కేసీఆర్ కి ఉన్న చరిష్మ. అందుకే కేసీఆర్ రావాలి మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కొందరు జర్నలిస్టులు కూడా కేసీఆర్ రావాలి మాట్లాడాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని కోరుతున్నారు.
ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈ మేదావులే, ఈ జర్నలిస్టులే కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వరా? రాత్రికి రాత్రే అద్బుతాలు జరిగిపోతాయా? అని మళ్ళీ విమర్శిస్తారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి కేసీఆర్ ని ఎన్ని బూతులు తిట్టినా.. ఎంత దుర్భాషలాడిన ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. అందులో ఆ మధ్య ఒక టివి చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. 5 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నా అని. ఇక్కడే కేసీఆర్ ఎంత హుందా తనం ప్రదర్శించాడో అర్థం చేసుకోవవచ్చు.
అంటే కేసీఆర్ ప్రజా సమస్యలపై నోరు విప్పడా? ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కేసీఆర్ ఫారం హౌస్ లోనే పడుకుంటాడా? ప్రజాలంటే లెక్కలేదా అన్నవాళ్లు ఉన్నారు. కానీ ప్రజా సమస్యలపై గళం విప్పడానికి తాను తయారు చేసిన ఉద్దండులు హరీష్, కేటీఆర్ ఎలాగో ఉన్నారు. అసెంబ్లీలో కూడా తమదైన సబ్జెక్టు, చాకచక్యంతో ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేత పత్రాల పేరిట గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించి ఇచ్చిన హామీలను ఎగగోడుదాం అని ప్రయత్నించిన ప్రభుత్వాన్ని హరీష్, కేటీఆర్ నిలదీసిన వైనాని చూసి కేసీఆర్ వారిద్దరే చాలు అని మౌనంగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు హరీష్, కేటీఆర్ వెనకాల ఉండి దిశానిర్దేశం చేస్తున్నాడు. అందుకే ప్రతి సమస్యపై ప్రభుత్వానికి ఊపిరాడనివ్వడం లేదు బావబామ్మర్డులు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా కేసీఆర్ ని తిట్టను తిట్టు లేదు. నోరు తెరిస్తే బూతుపురాణమే. కానీ ఏమైందో ఏమో కానీ గత నెల రోజులుగా కేసీఆర్ మీద కాస్త తగ్గినట్టున్నాడు. బహుశా కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి మాట్లాడితే ముఖ్యమంత్రి అని తనని పిలువాలని కోరుకుంటున్నాడేమో. లేక హరీష్, కేటీఆర్ తన స్థాయి వాళ్ళు కాదని కేవలం కేసీఆరే తన స్థాయి ప్రత్యర్థనీ అనుకుంటుండోచ్చు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో కేసీఆర్ బయటకు రావాలి, అసెంబ్లీ కి రావాలి, తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. మరి కేసీఆర్ ని అడిగే మనిఫెస్టో తయారు చేశారా? కేసీఆర్ ని అడిగే 6 గ్యారంటీలు ఇచ్చారా? కేసీఆర్ ని అడిగే 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి. మీకు పాలన చేతకాదా? ఒకవేళ మీకు నిజంగా పాలన చేతకాదు అంటే పార్టీలలో గౌరవాధ్యక్షుడు అన్న పదవి ఉంటది కదా అలానే కేసీఆర్ కి గౌరవ ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ కూర్చోబేట్టండి. రేవంత్ రెడ్డి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా వర్కింగ్ సిఎంలాగా ఉండమనండి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో సలహాలు, సూచనలు ఇస్తారు. ఎలాగో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఉండడం లేదు కదా… ఆ ప్రగతి భవన్ లో కేసీఆర్ కి కేటాయించండి. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుండి కేసీఆర్ డైరక్షన్ లో పరిపాలించమనండి. అప్పుడు రెండు పార్టీల కలిసి పనిచేస్తే ప్రజలకు మేలే కదా. ఏమంటారు?
(శ్రీధర్ యాలాల – విశ్లేషకులు)