ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనడం కొందరికి ఫ్యాషన్ అయిందంటూ నిన్న రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయగానే, కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారు.? ట్విట్టర్‌లో ఏ విధంగా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందామా..
ఉప్పు-నిప్పులా ఉండే బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం రాజుకుంది. అంబేద్కర్ కేంద్రంగా కొత్త రగడ మొదలైంది. నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉభయసభల్లో దుమారం రేపాయి. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోందో ప్రజలు చూస్తూనే ఉన్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆరు అంశాలతో కూడిన థ్రెడ్‌ను ఆయన పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ, దాని కుళ్లిన పర్యావరణ వ్యవస్థ రాజ్యాంగ నిర్మాతైన బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడాన్ని ద్వేషపూరిత అబద్దాలు దాచగలవని భావిస్తే.. వారంతా పొరపాటుపడినట్టేనని. భారతదేశ ప్రజలు ఓ రాజవంశం నాయకత్వంలోని పార్టీ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోంది.? అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, SC/STలను అవమానపరిచేందుకు అవసరమైన ప్రతీ అవకాశాన్ని వదులుకోకపోవడాన్ని గమనిస్తున్నారని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గత 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు సర్వశక్తులు ఒడ్డిస్తోందని అన్నారు. రంగం ఏదైనా కూడా.. 25 కోట్ల మంది పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా.. SC/ST చట్టాన్ని సైతం బలోపేతం చేశామన్నారు. అంతేకాకుండా అంబేద్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ద ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు ప్రధాని మోదీ. దశాబ్దాలుగా చైత్య భూమికి సంబంధించిన భూమి సమస్య పెండింగ్‌లో ఉంది. తమ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా.. తాను ఆ ప్రాంతంలో ప్రార్థనకు కూడా వెళ్లానని అన్నారు. అంబేద్కర్ తన చివరి సంవత్సరాల్లో గడిపిన అలీపూర్ రోడ్డును కూడా తామే అభివృద్ధి చేశామన్నారు. అలాగే లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.
ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనడం కొందరికి ఫ్యాషన్ అయిందంటూ నిన్న రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయగానే.. కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. మనుస్మృతిని నమ్మేవాళ్లకు అంబేద్కర్‌తో నిస్సందేహంగా ఇబ్బందే అంటూ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌తోపాటు, విపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మిస్టర్ షా దళితుల చిహ్నాన్ని అవమానించారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈరోజు పార్లమెంట్ సమావేశమైనప్పుడు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీఆర్ అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారు. బిఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎలా పక్కన పెట్టిందనే దానిపై షా చేసిన వ్యాఖ్యలను చూపని ఒక చిన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ ప్రసారం చేసిందని బిజెపి నాయకులు ఆరోపించగా, ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై దాడిని పెంచారు మరియు హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.