లగచర్ల దాడి ఘటనలో నిందితులకు బిగ్ రిలీఫ్ వచ్చింది. మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్‌రెడ్డి సహా 24మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులు వర్తిస్తాయని నిందితులందరికీ స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ.. లగచర్ల నిందితులకు నాంపల్లి కోర్టు ఎలాంటి కండీషన్స్ పెట్టింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి నిందితులకు భారీ ఊరట లభించింది. అధికారులపై దాడికి సంబంధించి జైల్లో ఉన్న నిందితులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాడి ఘటనలో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కీలక నిందితుడిగా భావిస్తున్న సురేష్‌తోపాటు మొత్తం 24మందికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పట్నం నరేందర్‌రెడ్డి 50వేలు, మిగతావారు 20వేలు చొప్పున షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే.. మూడు నెలలపాటు ప్రతి బుధవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని పట్నం నరేందర్‌రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఇక.. గత నెలలో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై గ్రామస్తులు చేయడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. లగచర్ల పరిధిలోని రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి వెంకట్‌రెడ్డితోపాటు పలు అధికారుల బృందం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. అయితే.. ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఒకచోట ఏర్పాట్లు చేస్తే.. గ్రామస్తుల విజ్ఞప్తితో కలెక్టర్ బృందం వేరే చోటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా యంత్రాంగంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు.
వాహనాలు దిగి సమావేశస్థలానికి చేరుకోగానే అధికారులపైకి దూసుకెళ్లారు ఫార్మా కంపెనీ బాధిత రైతులు, గ్రామస్తులు. కలెక్టర్‌తో పాటు అధికారులను తోసేస్తూ దురుసుగా వ్యవహరించడంతోపాటు.. వాహనాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పలువురు అధికారులకు గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించి నిందితులను అరెస్ట్ చేయించింది. 24మంది నిందితులు నెల రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇక, రాజకీయంగానూ లగచర్ల ఘటన తీవ్ర దుమారం సృష్టించింది.
కొడంగల్‌లో ఫార్మా కంపెనీకి భూములు కేటాయింపును వ్యతిరేకిస్తూ.. అక్కడి రైతులు చేపట్టిన ఆందోళన, రాజకీయంగా దుమారం రేపుతోంది. లగిచర్లలో గ్రామసభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా, పలువురు అధికారులపై కర్రలు, రాళ్లతో జరిగిన దాడి సంచలనం రేపింది. దీని వెనక బీఆర్‌ఎస్ హస్తం ఉందని అధికార కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పేరును ఏవన్ ముద్దాయిగా చార్జ్‌షీట్‌లో చేర్చారు.