తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి గాలులు విజృంభిస్తున్నాయి. రాత్రి వేళల్లోనే కాదు పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో టెంపరేచర్లు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఇదే మాదిరి మరో రెండు రోజులపాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు..

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలవుతుంది. ఇక ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గాలుల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఇదే మాదిరి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఈ క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయని, ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యల్పంగా హైదరాబాద్‌లో 6.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చాలా చోట్ల 7 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్‌చెరులో 7 డిగ్రీలు, మెదక్‌లో 7.5 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఈశాన్య దిశలో చలిగాలులు గంటకు 2 నుంచి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ 65 శాతంగా పేర్కొన్నారు. శీతలగాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని, ఉదయం, సాయంత్రం వేళల్లో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here