తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్‌ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. నాసిరకం ఆహారం, మౌలిక వసతుల కొరత కారణంగా నిత్యం ఎందరో పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు. కూటికి, గూడుకి, చదువుకు నోచుకోని ఎందరో నిరుపేదలు తమ పిల్లలను ఇంటికి దూరంగా గురుకుల హాస్టళ్లలో ఉంచి చదువుచెప్పిస్తున్నారు. అయితే ఈ గురుకులాలు విద్యార్ధుల పాలిట యమపాషాల్లా మారి వారి ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా గురుకుల విద్యాలయంలో చదువుతున్న మరో విద్యార్ధి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దాపూర్‌ గురుకుల స్కూల్‌లో బుధవారం (డిసెంబర్‌ 19) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురు కులంలో పాము కాటు మరోమారు కలకలం రేపింది. 3 నెలల క్రితం వారం వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురవ్వగా.. అందులో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓంకార్‌ రవి, రుచిత దంపతుల కుమారుడు అఖిల్‌ (14) జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే అఖిల్‌ బుధవారం ఉదయం పాము కాటుకు గురయ్యాడు. నిన్న ఉదయం ఆరుగంటల సమయంలో అఖిల్‌ తన చేయి తిమ్మిరిగా ఉందని హాస్టల్ నర్స్‌కు చూపించగా.. పరిశీలించిన నర్స్‌ ఏమీ కాలేదని సర్దిచెప్పింది. అనంతరం 9 గంటల సమయంలో అఖిల్‌ చేయి పూర్తిగా పటుత్వం కోల్పోయింది. దీంతో వెంటనే ప్రిన్సిపాల్‌ మాధవీలత దృష్టికి తీసు కెళ్లగా.. ఆమె చేతిపై పాముకాటు గాట్లు ఉండటం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలుడి తల్లి దండ్రులకు సమాచారం అందించారు. అఖిల్‌ ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గురువారం మరో విద్యార్ధికి పాముకాటు

పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో బుధవారం ఓ విద్యార్ధికి పాము కాటు గురవగా.. ఈ రోజు ఉదయం మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్‌ అనే విద్యార్థిని పాము కాటయడంతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ అతడిని కూడా కోరుట్ల దవాఖానకు తరలించారు. యశ్వంత్‌ ఉదయం నిద్రలేచేసరికి కాలుకు గాయమై ఉందని, దురదగా ఉండటంతో వెంటనే ప్రిన్సిపల్‌కు చెప్పాడు. దీంతో బాలుడిని కోరుట్ల దవాఖానకు తరలించగా.. అక్కడ టెస్టులు చేయగా పాము కాటేసినట్లు నిర్ధారనైంది. కాగా ఇప్పటి వరకు ఇదే గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్ధులను పాములు కాటేశాయగా.. వారిలో ఇద్దరు మృతి చెందారు. వరుస పాము కాటు ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here