- ప్రాణాలు తీస్తున్న పాములు
- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు
- ఆరుగురు విద్యార్థులను కాటేసిన పాములు.. ఇద్దరు మృతి
- పాము కరిచిందని చెప్పినా.. జ్వరం ట్యాబ్లెట్స్ వేసుకోమన్న అధికారులు
- ఇంకో చోట విద్యార్థిని కొరికిన ఎలుకలు
- మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు
- పట్టించుకోని అధికారులు, సిబ్బంది
- నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోన్న ప్రభుత్వం
- విద్యా శాఖ మంత్రి ఎక్కడా?
- భయపడిపోతున్నా విద్యార్థులు
- ఆందోళనలో తల్లిదండ్రులు
(శ్రీధర్ యాలాల)
తెలంగాణ గురుకుల పాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆసుపత్రులకు పరుగుల పెట్టించాయి. ఇప్పుడు మరో సమస్య వారిని వెంటాడుతోంది. విష సర్పాలు కాటేసి చంపుతున్నాయి. ఎలుకలు కొరికి చిత్రవధ చేస్తున్నాయి. మొత్తానికి గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో ఉండాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ఏడాది కావోస్తున్నా ఇంతవరకు విద్య శాఖ మంత్రి లేదు. సిఎం దగ్గరే విద్య శాఖ ఉన్నా కూడా ఒక్క సమీక్ష చేసింది లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులను ఎలా అరెస్ట్ చేయాలి అని గంటల తరబడి కేబినెట్ లో చర్చిస్తారు కానీ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే మాత్రం చర్చించారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ అతడిని కోరుట్ల దవాఖానకు తరలించారు. బుధవారం ఇదే స్కూల్‌లో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచిన విషయం తెలిసిందే. యశ్వంత్ ఉదయం నిద్రలేచేసరికి కాలుకు గాయమై ఉంది. దురదలు రావడంతో విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పాడు. దీంతో యశ్వంత్‌ను కోరుట్ల పట్టణంలోని దవాఖానకు తరలించారు. అక్కడ టెస్టులు చేయగా పాము కాటేసినట్లు తేలింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ గురుకుల పాఠశాలలో పాములు ఆరుగురిని కాటేశాయి. వారిలో ఇద్దరు మృతి చెందారు. వరుస పాము కాటు ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
నిన్నే అంటే బుధవారం (18 డిసెంబర్ 2024) ఇదే పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి స్నానం చేస్తుండగా పాముకాటు వేయడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే విద్యార్థిన్ని కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. పామును కర్రలతో కొట్టి చంపారు. పాము కాటుకు గురైన వెంటనే టీచర్లు విద్యార్థి సమాచారం ఇచ్చిన కూడా పట్టించుకోకపోవడంతో తన తల్లిదండ్రులకు విద్యార్థి సమాచారం ఇచ్చారు. విద్యార్థి తల్లిదండ్రులు పెద్దాపూర్ గురుకులం చేరుకొని ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు పరీక్షించి పాము కాటేనని నిర్ధారించారు. పెంజర పాము అని తెలియడంతో విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇచ్చామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి చికిత్స తీసుకుంటున్నాడు. పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోవడంతో లేదని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పాము కరిచిన విషయం ఉపాధ్యాయులకు విద్యార్థి చెప్పిన కూడా జ్వరం ట్యాబ్లెట్స్ వేసుకోమని సలహా ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో నాలుగు నెలల క్రితం పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
విద్యార్థిని కరిచిన ఎలుకలు.. ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్
మరోవైపు ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థినికి ఎలుకలు కరిచాయి. ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా 15సార్లు ఎలుకలు కరిచినట్టు విద్యార్థి చెబుతోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని పగబట్టినట్టు ఎలుకలు కరిచాయి. అయినా అధికారులు స్పందించలేదని హరీష్ విమర్శలు చేశారు. అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదని వైద్యాధికారులను హరీష్ నిలదీశారు. తీవ్ర అనారోగ్యంపాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు? అనిప్రశ్నించారు. అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయాయని దారుణమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు. సీఎం హోదాలో పీవీ నరసింహారావు 1971లో ప్రారంభించిన మొదటి గురుకుల పాఠశాలలో కూడా సమస్యలు ఉన్నాయన్నారు హరీష్. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్‌లో విద్యార్థినితో వంట చేయించారని మండిపడ్డారు. ఆ క్రమంలోనే రాగి జావ ఆ విద్యార్థిపై పడిందని వీడియోలు ఫొటోలు ఎక్స్‌లో పోస్టు చేశారు. తీవ్రంగా గాయపడి ఆ బాలిక ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉందని వాపోయారు.
ఒకవైపు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ జరుగుతున్న టైంలోనే ఇలాంటివి జరగడం దారుణం అన్నారు. గురుకులల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండని ప్రభుత్వానికి హరీష్ సూచించారు. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడండని విజ్ఞప్తి చేశారు.
పుస్తకాలలో పాఠాలు నేర్చుకోవాలా.. పాములు పట్టడం నేర్చుకోవాలా?: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రభుత్వంలో కొండచిలువలు పాగా వేస్తే, కళాశాలలో కట్లపాములు కాటేయవా అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాము కాట్లపై ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క సలహాలు ఇవ్వొచ్చని అన్నారని, కాబట్టి తాను కొన్ని సూచనలు చేస్తున్నానని వెల్లడించారు.
అవి..
- ప్రతి రోజూ ఒక మంత్రి పెద్దాపూర్ గురుకులంలో పిల్లల డార్మిటరీలో పడుకోవాలి (ప్రిన్సిపల్ రూంలో కాదు).
- సచివాలయాన్ని పెద్దాపూర్ గురుకులంకు తరలించవచ్చు.
- ప్రతి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఒక స్నేక్ క్యాచర్ పోస్టును కేటాయించి వారిని టీజీపీయస్సీ ద్వారా రిక్రూట్ చేసుకోవచ్చు. ఆ పరీక్షలో ప్రశ్నలు మాత్రం తెలంగాణ పాముల గురించే అడగాలి, గ్రూప్-2లో లాగా పక్క రాష్ట్రాల పాముల గురించి కాదు.
- పెద్దాపూర్ గురుకులాన్ని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మార్చి ఇప్పుడున్న గురుకులాన్ని సరీసృప నిలయంగా మార్చవచ్చు.
- మాకు పిల్లల ప్రాణాలు రక్షించడం చేతకాదు, కేవలం అక్రమ కేసులు పెట్టడమే వచ్చు మహాప్రభో అని మీరందరూ సామూహిక రాజీనామా చేయవచ్చు. మా చావు మేము చస్తాం.
లేకపోతే.. మీ ఇళ్లలోకి పాములు రావు కాని మా పిల్లల బడుల్లోకి ఎట్ల వచ్చి మళ్లీ మళ్లీ కాటేస్తున్నాయి? పుస్తకాలలో పాఠాలు నేర్చుకోవాలా? పాములు పట్టడం నేర్చుకోవాలా? కాంగీ దయ్యాలు?.. అంటూ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.