ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్‌గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా … పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
ఫార్ములా E కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదు కావడం… తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ వెల్లడించారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు ఆరోపించారు.
2001లోనే హైదరాబాద్‌లో ఫార్ములా-1 రేస్ పెట్టాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందని కేటీఆర్ తెలిపారు. కానీ మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించామని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు శాసనసభలో అనుమతించాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఫార్ములా-ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. అక్రమాలు నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ నిర్వహించడంపై సచిన్, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రశంసించారని కేటీఆర్ గుర్తు చేశారు. కారు రేస్ నిర్వాహకులకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు చెల్లించిందని వెల్లడించిన కేటీఆర్, ఇది వాస్తవమని నిర్వాహకులు అంగీకరిస్తు్న్నారని, ఇందులో అవినీతి జరిగింది ఎక్కడో వివరణ ఇవ్వాలన్నారు. రేసింగ్ రద్దయినందున లైసెన్స్ ఫీజు రూ.74లక్షలు వాపస్ తీసుకోవాలని ఎంఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. రాజకీయ కేసు.. రాజకీయంగానే కొట్లాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ORR టెండర్‌పై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించడంపై కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే.. సీఎం రేవంత్ రెడ్డి ORR టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇదిలావుంటే, గత బీఆర్‌ఎస్ హయంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా E కార్ రేసింగ్‌లో.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది అవినీతి నిరోధక శాఖ. ఈ వ్యవహారంలో కేటీర్‌ను A-1 ముద్దాయిగా నిర్ధారిస్తూ.. ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేసింది. కేటీఆర్‌పై 13(1)A, 13(2) పీసీ యాక్ట్, 409,120B వంటి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టింది. RBI మార్గదర్శకాలకు విరుద్ధంగా FEO సంస్థకు నిధులు బదలాయించినట్టు ఆరోపించిన ఏసీబీ.. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నిధులు మళ్లించడాన్ని నేరంగా పరిగణించింది. కేబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ సెక్రెటరీ క్లియరెన్స్ లేకుండా… సొంత నిర్ణయంతో HMDA బోర్డు నుంచి నిధులు మళ్లించారని కేటీఆర్‌పై అభియోగం మోపింది ఏసీబీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే.. ఈ చెల్లింపులు జరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది ఏసీబీ. ఇక E కార్ రేసింగ్ అంశంలో.. అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శ అర్వింద్ కుమార్, మరో HMDA అధికారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.