మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేటీఆర్ కు తాత్కాలిక ఊరట కల్పించింది.
అది పక్కన పెడితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఈ ఫార్ములా రేసులో 55 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఏ), 13(2), అలాగే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (విశ్వాస ద్రోహం), 120(బి) (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అదే సమయంలో ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. . ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనివార్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేయాల్సి వచ్చిందని అంగీకరించారు. హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడటం, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం కోసం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరగాలని తాను భావించాననీ, అయితే స్పాన్సర్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ నుండి వైదొలగాలని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు భావించడంతో తాను చొరవ తీసుకుని 55 కోట్లు నిర్వాహకులకు బదిలీ అయ్యేలా చేశాననీ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న కేటీఆర్, అదే ఈ రేసు రద్దు అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే నిర్వాహకులకు రూ.55 కోట్ల బదిలీ చేసినట్లు వివరించారు.
అయితే కేటీఆర్ వివరణ వల్ల చట్టపరమైన చిక్కుల తొలిగిపోయే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. రూ. 10 కోట్లకు పైగా ఖర్చులకు ఆర్థిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వంనుంచి పరిపాలనా అనుమతి అవసరం. కానీ అలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్ల బదిలీ జరిగిపోయింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. అసలీ బదలాయింపుపై ఆర్థిక శాఖకు కనీస సమాచారం కూడా లేదు.ఇవేమీ లేకుండానే ఫార్ములా ఇ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఇఒ) కు బదిలీ చేశారు. ప్రభుత్వం విదేశీ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసినప్పుడు ఆర్‌బిఐకి తెలియజేయాలి, కనీసం అది కూడా జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి, ఈ కేసులో కెటిఆర్ కు చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కచ్చితంగా విధాన లోపం, నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.