ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. జగన్ వెంట ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే, తన చెల్లి షర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు ఆరంభించారు. ముఖ్యంగా ఆమెను ఏపీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు ఢిల్లీలో ఆయనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లో ఒకరిద్దరు సీనియర్ నేతలకు వైసీపీ కండువా కప్పి షర్మిలకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి వైస్ షర్మిల కీలక భూమిక పోషించారు. అయితే, సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిలను పక్కన పెట్టేశారు. ఆస్తుల విషయంలోనూ వారిమధ్య వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో షర్మిల తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జగన్ రెడ్డి టార్గెట్ గా ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమికి ప్రధాన కారణాల్లో వైఎస్ షర్మిలకూడా ఒకరు. ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తరువాతా కూడా జగన్ రెడ్డి టార్గెట్ గా షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు షర్మిల విషయాన్ని పెద్దగా పట్టించుకోని జగన్.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భయపడుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో షర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా పావులను కదిపేందుకు జగన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
ఏపీ కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను జగన్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. షర్మిల నాయకత్వంపై కొంతకాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు రూడా చేశారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నారని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కేంద్ర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా షర్మిలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్య అనుచరులుగా కొనసాగిన నేతలు కొందరు ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారందరితో ఇటీవల జగన్ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జగన్, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్, జగన్ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చజరిగిందని తెలుస్తోంది. అయితే, అంతకుముందే వైసీపీలో చేరే విషయంపై జగన్, శైలజానాథ్ మధ్య చర్చలు జరిగాయన్న ప్రచారం ఉంది. వచ్చే రెండు నెలల్లో శైలజానాధ్ తోపాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యనేతల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని ఓ సీనియర్ నేత, తెలంగాణకు చెందిన ఓ కీలక నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.