ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వమ్య దేశం ఇండియా. అయితే ప్రస్తుతం ఇండియాలో ప్రజాస్వామ్యం అన్నదానికి అర్ధం మారిపోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే తొలి రెండు సార్లూ కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపే బలం బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు.. మూడో సారి మాత్రం ఆ బలాన్ని ఇవ్వలేదు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి కల్పించి.. వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న ప్రధాని మోడీ సర్కార్ కు చెక్ పెట్టారు. వ్యక్తిగత అజెండా, సంఘ్ పరివార్ రహస్య అజెండా అమలుకు అసలే మాత్రం అవకాశం లేకుండా ముందరి కాళ్లకు బంధం వేశారు.

అయితే ప్రతిపక్ష  కూటమి అనైక్యత కారణంగా ఆ బంధనాలు మోడీ సర్కార్ ను ఇసుమంతైనా ఇరుకున పెట్టలేకపోతున్నాయి. జమిలి ఎన్నికల నుంచి, ఎన్నికల సంస్కరణల వరకూ అన్నీ తన ఇష్టారాజ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లేలా చేస్తున్నది. తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మోడీ నిర్ణయం ఆ విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంది.

ఎన్నికలకు సంబంధించి సిసి టీవి ఫుటేజి, వెబ్‌ కాస్టింగ్‌, అభ్యర్ధుల వీడియోలు వంటి ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీని కేంద్రం నిషేధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు తావే లేకుండా చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం  ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ఆధారిత పార్లమెంటరీ వ్యవస్థకు తీవ్ర విఘాతం అనడంలో ఇసుమంతైనా సందేహాంచాల్సిన అవసరం లేదు. 1961-ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం ఎవరైనా ఎన్ని కలకు సంబంధించిన అన్ని రికార్డులనూ తనిఖీ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ రికార్డుల పరిశీలన కుదరదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఎన్నికల రూల్స్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఒక కేసు కారణంగా ఎన్నికల సంఘం (ఇసి) సిఫారసు మేరకు రూల్స్‌ సవరించామన్న ప్రభుత్వ వివరణ ఈ దుర్మార్గ నిర్ణయం విషయంలో తన చేతికి మట్టి అంటుకోలేదని సంబరపడటానికి తప్ప మరెందుకూ పనికి రాదు.

ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హర్యానా-పంజాబ్‌ హైకోర్టులో వేసిన కేసులో పిటిషన్‌దారు అభ్యర్ధన మేరకు రికార్డులన్నింటినీ షేర్‌ చేయాలని న్యాయస్థానం ఇసి ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ రూల్స్‌ ప్రకారం ఇవ్వాలని నిర్దేశించింది. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన ఇసి, అందుకు భిన్నంగా రూల్స్‌ మార్చాలని కేంద్రాన్ని కోరింది. అలా కోరడం తరువాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద నిబంధనలను మార్చేసి న్యాయస్థానం అదేశాలను తుంగలోకి తొక్కేసింది.

రిగ్గింగ్‌, అవకతవకలు సహా ఎన్నికల్లో అక్రమాలను, నిరోధించేందుకు, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం సిసి టీవీలను, వెబ్‌ కాస్టింగ్‌ను కొన్నేళ్ల కిందట  ఈసీ  ప్రవేశపెట్టింది. పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో  అభ్యర్ధుల, రాజకీయ పార్టీల ఫిర్యాదుల మేరకు ఈసీ వీడియోలను పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం విస్తృత సంప్రదింపులు జరపడం ఆనవాయితీ.  కానీ ప్రస్తుత రూల్స్‌ మార్పుపై ఆ విధంగా చర్చ జరగలేదు. ఈసీ కోరింది. కేంద్రం చేసేసింది. అంతే. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.   రికార్డుల తనిఖీ వలన ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని, వీడియోలను ఉపయోగించుకొని కృత్రిమ మేధ సహాయంతో పైరసీ వీడియోలు తయారు చేస్తున్నారన్న కేంద్ర ప్రభుత్వ, ఇసి వాదనలో పస లేదు. ఎన్నికల రికార్డులు బయట పడితే  తమకు ఇబ్బంది అన్న భయంతోనే  మోడీ సర్కార్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం విధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ సర్కార్‌ ప్రభావంలో ఇసి పని చేస్తోందనడానికి గడచిన పదేళ్లల్లో ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకపు ప్యానెల్‌లో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ను తొలగించడంతోనే ఈ విషయం నిర్ద్వంద్వంగా రుజువైంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రూల్స్‌నే మార్చేయడం తిరుగులేని రుజువుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్వతంత్రంగా పని చేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ ఇసిపై ఇంతటి స్థాయిలో సందేహాలు రావడం ఏ విధంగా చూసినా  ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల సంఘంపై  ప్రజలు విశ్వాసం కోల్పోతే రాజ్యాంగానికే ప్రమా దం. రాజకీయ పార్టీల, అభ్యర్ధుల హక్కులను ప్రస్తుత నిబంధనల మార్పు చిదిమేస్తుందనడంలో సందే హం లేదు. కాగా నిబంధనలను మార్చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అది వేరు సంగతి. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఎన్నికల నిబంధనలను మార్చేసి ఎలక్ట్రీనిక్  రికార్డుల తనిఖీపై విధించిన నిషేధాన్ని మోడీ సర్కార్ బేషరతుగా తక్షణమే ఉపసంహరించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here