దేశం నాకేమిచ్చిందని కాదు.. దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలనేది పెద్దలు చెప్పిన మాట.   మన భారతదేశంలో  పుట్టిన మహా పురుషుడు  శ్రీ రతన్ టాటా..  ఈ మాటను నిజం చేశారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక బిజినెస్ మెన్ ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించినా సరే జనం అతన్ని ఒక బిజినెస్ మేన్ లాగానే గుర్తించుకుంటారు. కానీ టాటా గారిని అందరూ ఒక గొప్ప బిజినెస్ మెన్లా  కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా  గుర్తుపెట్టుకుంటారు. టాటా అనేది ఇంటి పేరు అయినప్పటికీ ఆ పేరు కుటుంబంలో అందరికీ ఉన్నప్పటికీ,  టాటా అనగానే ఈ తరానికి గుర్తొచ్చేది  రతన్ టాటా గారి  నవ్వు మొహమే. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ గా  ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఆయన  భారత వ్యాపార రంగాన్ని పునః రూపొందించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నైతికత, దానగుణం కలిగిన వ్యక్తిగా  అందరి మనసులూ గెలుచుకున్నారాయన. డిసెంబర్ 28 ఆయన జన్మదిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంట..

రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బాంబేలో(నేటి ముంబై) జన్మించారు. ఆయనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవటంతో  వాళ్ళ బామ్మ, తాతయ్యలు దత్తత తీసుకుని పెంచారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీ నుంచి  ఆర్కిటెక్చర్ అండ్ కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో హయ్యర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. టాటా సంస్థకు వారసుడు అయినా  1962లో టాటా గ్రూపులో ఒక సాధారణ ఉద్యోగిగా  ప్రయాణాన్ని  ప్రారంభించారు. తన ప్రతిభతోనే 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించబడ్డారు.

టాటా సంస్థకు చైర్మన్ అయ్యాక భారత వ్యాపార వాతావరణం వేగంగా మారిపోంది. టాటా గ్రూపుని  తనదైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కించారు. సంస్థ కార్యకలాపాలను విభజించడంలోనూ,  గ్లోబల్ స్థాయిలో  బిజినెస్ను  విస్తరించడంలో, సాహసోపేతమైన  నిర్ణయాలు తీసుకోవడంలోనూ వెనకడుగు వేయక విదేశాలలో వ్యాపారం చేయగల సత్తా భారత్ కు ఉందని నిరూపించారు.

టాటా నానో.. టాటాకు మిగిల్చిన నిరాశ..

భారతదేశంలో  అత్యంత చౌకైన కారుగా టాటా నానో సెన్సేషన్ సృష్టించింది.  మధ్యతరగతి  వారు కారులో తిగాలనే కలను చవకగా అందించాలనేది టాటా సంకల్పం.  కానీ డబ్బు ఎక్కువ పెట్టి బ్రతకడమే గొప్ప అనే మెంటాలిటీతో ఉన్న భారతీయులు టాటా సంకల్పం పై నీళ్లు చల్లారు. టాటా నానో కారును నిరుత్సాహపరిచారు.  ఫలితంగా ఆ కారు కనుమరుగైంది.  ఆర్థిక సమస్యలు పెరిగిన నేటి కాలంలో చాలామందికి ఇప్పుడు ఆ కారు విలువ అర్థం అవుతోంది. కానీ ప్రజల చేయి దాటిపోయింది.

రతన్ టాటాగారి  21 సంవత్సరాల నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభం 50 రెట్లు పెరిగింది. టాటా టీ ద్వారా టెట్‌లేను, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను, టాటా స్టీల్ ద్వారా కోరస్‌ వంటి ఎన్నో పెద్ద కంపెనీలను  సొంతం చేసుకున్నారు. వంటగదిలో ఉండే ఉప్పు నుంచి ప్రతిష్టాత్మక వాహనాల దాకా అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి  ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు.

రతన్ టాటా యొక్క నాయకత్వంలో ఉన్న కీలక అంశాలలో ఒకటి… ఆయన వ్యాపారంలో నైతికతపై దృష్టి పెడతారు. వ్యాపారంలో న్యాయం, పారదర్శకత ఉండాలని నమ్ముతారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ యొక్క ప్రాముఖ్యతను ఆయన గట్టిగా నమ్మేవారు.  తాత్కాలిక లాభాల కంటే తన ఉద్యోగుల సంక్షేమాన్ని, సమాజ పటిష్టతలకి ప్రాధాన్యత ఇచ్చేవారు.  2008 లో ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన టాటా గ్రూపుని సమర్థవంతంగా నడిపించారు.

రతన్ టాటా ఇంత పెద్ద వ్యాపార వేత్త అయినా ఆయన ధనవంతుల జాబితాలో పైకి కనిపించరు. దీనికి కారణం  ఆయన చేసే సేవా  కార్యక్రమాలు.  ఆయన నేటికాలపు దానకర్ణుడు అని చెప్పవచ్చు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి వివిధ  కార్యకలాపాల కోసం తన వ్యాపార లాభాల రాబడి నుండి సుమారు 60 నుండి 65శాతం విరాళాలకు కేటాయించారు. ప్రపంచానికి గడ్డు కాలం అయిన కరోనా సమయంలో భారతదేశంకోసం 500కోట్లను విరాళంగా ఇచ్చిన మహనీయుడు ఆయన.  కావాలంటే దేశం కోసం నా ఆస్తులు అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన దయా హృదయుడు. దేశం కష్టాలలో ఉన్న ప్రతిసారి దేశాన్ని ఆదుకున్న భరతమాత ముద్దు బిడ్డ. రతన్ టాటా ఈ దేశం కోసం మళ్లీ పుట్టాలని కోరుకుందాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here