రేవంత్ సర్కార్, టాలీవుడ్ మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని మహిళ మృతిచెందగా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత అల్లు అర్జున్ అరెస్టు కావటం, బెయిల్ పై జైలు నుంచి బయటకు రావటం చకచకా జరిగిపోయాయి.
అయితే, వివాదం సర్దుమణిగిందని అంతా భావిస్తున్న దశలో థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి రేవంత్ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో రేవంత్ సర్కార్, సినీ ఇండస్ట్రీకి మధ్య ఎవరూ పూడ్చలేని గ్యాప్ ఏర్పడిందని అంతా భావించారు. కానీ రెండుమూడు రోజులకే సినీ ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు భేటీ అయ్యారు. ప్రభుత్వం, ఇండస్ట్రీకి మధ్య వివాదం సమసిపో యిందనిపించారు. అయితే, గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనూ సినీ ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా వివాదం కొనసాగింది. జగన్ తన మొండి వైఖరితో వివాదాన్ని పెంచుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన చాకచక్యంతో వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గమనించిన వైసీపీ నేతలు సినీ పెద్దల పట్ల జగన్ అప్పట్లో అవలంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీని చులకనగా చూశారన్న వాదన ఉంది. సినిమా రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా కొద్ది రోజులు వివాదం కొనసాగింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మహేశ్‌బాబు, ప్రభాష్, రాజమౌళి తదితరులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో జగన్ వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవైనా.. ముఖ్యమంత్రి ఎవరున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి వెళితే ఘన స్వాగతం లభించేది. కానీ, జగన్ మాత్రం చిరంజీవి, ఇతర హీరోల వాహనాలను లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కార్లను గేటు బయటే వదిలేసి జగన్ ను కలిసేందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దీనికితోడు జగన్ తో సమావేశం అయిన సమయంలో మీరేంటి హీరోలు.. నేను అసలైన హీరో అన్నట్లుగా జగన్ ప్రవర్తన కనిపించింది. ఈ క్రమంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు జగన్ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిరంజీవి పట్ల జగన్ మోహన్ రెడ్డితీరును తీవ్రంగా తప్పుబట్టారు. మెజార్టీ ప్రజలుసైతం సినీ హీరోల పట్ల జగన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. దీనికితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సినీ ఇండస్ట్రీపై నోరుపారేసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వైసీపీ ఘోరం ఓటమికి ఈ ఘటన కూడా కారణమైందని చెప్పొచ్చు.