ప్రపంచంలో మనిషి ఎప్పుడూ ఎదుటివారి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటాడు. అది తన కంటే తక్కువ వర్గానికి చెందిన జాతుల మీద అయినా, వేరే వర్గానికి చెందిన జంతువుల మీద అయినా.. తన కింద కొందరు ఆటబొమ్మలుగా ఉంటే తృప్తి పడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు. వారి మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా నమ్మిస్తారు. సులభంగా వారి మీద తమ మాటలతో ఆధిపత్యం తెచ్చుకుంటారు. ఇతరులను నియంత్రిస్తారు. ఇలాంటి వారిని మానిప్యులేటివ్ వ్యక్తులని చెబుతారు. ఇలా మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం వల్ల తాము చాలా గొప్పవారిమని, తెలివైన వారిమని అనుకుంటారు. ఇతరులు ఎప్పుడూ తమ చెప్పుచేతలలో ఉంటారనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం ఇతరులకే కాదు.. మానిప్యులేటివ్ వ్యక్తులకు కూడా మంచిది కాదని చెబుతున్నారు.
మానిప్యులేటివ్ గా ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన వారి వ్యక్తిగత రిలేషన్స్ విచ్చిన్నం కావడానికి దారి తీస్తుందట. వారి ప్రవర్తన వ్యక్తిగత బంధాలలో విభేదాలు సృష్టిస్తుంది. ఇది వ్యక్తులకు బంధం మీద, పరిస్థితుల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.
అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానిప్యులేటివ్ వ్యక్తులు తమ మాటలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటారో.. ఇతరులను ఎలా బోల్తా కొట్టిస్తారో..ఇతరులు తనతో అలాగే ఉంటారేమో అనే భ్రమలో ఉంటారు. ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యుల మాటలను కూడా అంత తేలికగా నమ్మరు. వారిని విశ్వసించరు. ఈ కారణం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అపనమ్మకం చాలా ఎక్కువగా తొంగిచూస్తుంది.
మానిప్యులేటర్ వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉండటానికి, వారితో మాట్లాడటానికి ప్రజలు ఇష్టపడరు. మానిప్యులేటివ్ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మానిప్యులేటివ్ వ్యక్తులు తమ సొంత ఇష్టాలను, వారి సొంత అవసరాలను కూడా వారే అర్థం చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గందరగోళంగా ఉంటారు. ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ ఎక్కువగా ఇతరులపైనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మానిప్యులేటర్లు ఎక్కువగా ఇతరుల జీవితాలను చూస్తూ.. ఇతరుల జీవితాలను తమ చెప్పుచేతలలో ఉంచుకోవడంలోనే కాలం గడిపేస్తుంటారు.మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన ఆఫీసులలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందరి నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను తమ చెప్పుచేతలలో పెట్టుకోవాలనే ఆలోచనల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఏర్పడతాయి. వీటి కారణంగా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. క్రమంగా ఒకరిని నియంత్రించాలని ప్రయత్నించడమనే అలవాటు.. ఆ నియంత్రించే వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది.