ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చురుగ్గా కసరత్తు చేస్తోంది.
ఈ పథకం వచ్చే ఏడాది ఉగాది నుండి అమలులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన చర్చలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, మరికొంతమంది ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు.
ఇప్పటికే అమలులో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ పథకం పనితీరును అధ్యయనం చేస్తున్నామని వారు చంద్రబాబుకు తెలియజేశారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఇటీవల ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.