మనిషి రోజువారి జీవితంలో సోషల్ మీడియా ఓ భాగం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు రోజుకు కొన్ని గంటలు సోషల్ మీడియాలో నిమగ్నమై పోతున్నారు. దీనిద్వారా అనేక లాభాలు ఉన్నాయి. చదువుకునే వారి నుంచి వ్యాపార రంగం, రాజకీయ రంగం.. ఇలా ఏ రంగంలోని వారైనా సోషల్ మీడియా ద్వారా మరిన్ని విషయాలపై అవగాహన పెంచుకునే వీలుంటుంది. చాలా మంది దీనిని మంచి మార్గంలో వినిగించుకుంటుంటే.. కొందరు మాత్రం సోషల్ మీడియాను చెడుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం, మార్ఫింగ్ ఫొటోలతో మహిళలను కించపర్చడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వీటిని పెంచిపోషించింది. అంతేకాదు.. ఇందుకోసం కొంతమందిని నియమించుకొని పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతలు, వారి ఇళ్లలోని ఆడవారిపై బూతులతో అసభ్యకర పోస్టులు పెట్టి ఇబ్బందులు గురిచేశార
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆగడాలతో పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాల్లోని ఆడవారిపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టారు. వైఎస్ కుటుంబాన్నికూడా వదల్లేదు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. వీటిపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. వారిని ప్రోత్సహించింది. అసభ్యకర పోస్టులపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా షర్మిలసైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కొరడా ఝుళిపిస్తున్నది. ఈక్రమంలో కొందరు అరెస్టుఅయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై ప్రభుత్వం క్యాంపెయిన్ చేపట్టింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి చెక్ పెట్టేలా చర్యలు ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా దూషించే, రెచ్చగొట్టే పోస్ట్‌లను షేర్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా.. ప్రత్యేకమైన, ఊహించని ప్రచారంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. అమరావతి, గుంటూరు, విజయవాడతో సహా ఏపీ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఆసక్తికరమైన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నాలుగు మంకీస్ బొమ్మలతో చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, వారి కుటుంబాలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో ఇబ్బందులు పెట్టిన వారిపట్ల కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాను మంచికోసం వాడుదాం.. అసత్య ప్రచారాలకు, స్వస్తి పలుకుదాం అంటూ పెద్ద పెద్ద పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వీటిని రూపొందించారు. కొందరు సినీ ప్రముఖులుసైతం ముందుకొచ్చి సోషల్ మీడియాను మంచికోసం వినియోగిద్దాం.. చెడు పోస్టులకు దూరంగా ఉందాం అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా యూజర్లను చైతన్యపరిచేలా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. అదేసమయంలో ఆలోచింపజేస్తున్నాయి.