ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫొటోల పిచ్చి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది ఆయన అధికారంలో ఉండగా పీక్స్ కు చేరింది. వైసీపీ నేతలే ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని అప్పట్లో తమలో తాము గుసగుసలాడుకేనే వారు. వైసీపీ పరాజయం తరువాత ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా పలు సందర్భాలలో చెప్పారు.  జగన్ హయాంలో  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  చేశాయి.

అన్నిటి కంటే విచిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ ఆయ‌న ముఖ చిత్రం ముద్రించు కున్నారు.చివరాఖరకు సర్వే రాళ్లపై సైతం జగన్ బొమ్మ పెట్టుకున్నారంటే ఆయన పిచ్చి ఏ స్థాయిలో ఉండేదో ఎవరికైనా అవగతమౌతుంది.  జగన్ ఫొటోల పిచ్చి కూడా ప్రజలలో ఆయన ప్రతిష్ఠ దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. చివరాఖరుకు పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా జగన్ ఫొటో ఉండటంతో జనం తీవ్రంగా ఏవగించుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన జగన్ సతీమణి భారతిని ఓటర్లు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ నిలదీశారు. సరే జగన్ పార్టీ పరాజయం పాలైంది. అధికారాన్ని కోల్పోయింది. గత ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సర్వే రాళ్ల నుంచి, పట్టాదారు పాసు పుస్తకాల వరకూ జగన్ ఫొటోలను తీసేయడానికి బోలెడంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏటా విడుదల చేసే వార్షిక క్యాలెండర్ పై కూడా  2019-24 మధ్య కాలంలో  అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రం మస్ట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. క్యాలెండర్‌లోని ప్రతి పేజీలో జగన్ ఫోటో  నవరత్నాల లోగోలు ఉండేవి. ఆ ఐదేళ్లూ రాష్ట్ర ప్రభుత్వ వార్షిక క్యాలెండర్లు జగన్ ఫొటో ఎగ్జిబిషన్ లా ఉండేవి తప్ప క్యాలెండర్ గా ఉండేవి కావు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2025 వార్షిక క్యాలెండర్ లో  జగన్ ఆరంభించిన సంప్రదాయానికి ముగింపు పలకడమే కాకుండా, వినూత్నంగా, హుందాగా వర్తమాన రాజకీయ నాయకుల ఫొటోలకు తావే లేకుండా చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తాజాగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ లో  స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు,   ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి  ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి.  ఐదు సంవత్సరాలుగా జగన్ బొమ్మతో  రోత పుట్టించిన ప్రభుత్వ వార్షిక క్యాలెండర్ ఇప్పుడు స్ఫూర్తిదాయక నేతల ఫొటోలతో విడుదల కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here