నాగారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు, స్థానిక ప్రదర్శనశాలలోని శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఫణిగిరి కొండల పైనున్న బౌద్ధారామాన్ని మంగళవారం(డిసెంబర్ 31) సందర్శించారు.
స్థూపం, చైత్య గృహాలు, శిలామండపాలు, విహారాలు, స్థానిక ప్రదర్శనశాలలోని సిద్ధార్థుని జననం, మహాభినిష్క్రమణం, బుద్ధుని ధర్మ చక్రప్రవర్తన, జాతక కథల బుద్ధుని శిల్పాల గురించి ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. క్రీస్తుపూర్వం 1- క్రీస్తుశకం 4 శతాబ్దాల మధ్య ఫణిగిరి గొప్ప బౌద్ధ క్షేత్రం గా విలసిలిందని ఆయన వారికి చెప్పారు. సర్పంచ్ గట్టు నర్సింహారావు వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి మ్యూజియం సిబ్బంది వీరయ్య, యాకయ్య, కార్తీక్ పాల్గొన్నారు.