సినీ నటి ఖుష్బూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆమెకు ఏ పార్టీలోకి వెళ్లినా తీవ్ర నిరాసే ఎదురవుతుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆమెకు సముచిత గౌరవం లభించడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా ఓ విలేఖరితో ఆమె చేసిన సంభాషణల ఆడియో లీక్ అయింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏ విధంగా రికార్డు చేస్తారంటూ ప్రశ్నించారు.
అయితే, తాను ఫోనులో చెప్పిన మాటలు వాస్తవమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఫోన్ సంభాషణను ఈ విధంగా రికార్డు చేయడం బాలేదన్నారు. తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ స్థానిక మీడియా సంస్థ ఫోన్ కాల్లో ఆమెను సంప్రదించింది. భాజపా ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై విలేకరి ఆమెను ప్రశ్నించాడు.
దీనిపై ఆమె స్పందిస్తూ.. తమిళనాడు భాజపా తనని పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డును సదరు మీడియా సంస్థ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఆమె అనుమతితోనే దీనిని రిలీజ్ చేస్తున్నామని పేర్కొంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్ ఎలా రికార్డు చేస్తారు? కానీ, నేను నిజమే చెప్పా. భాజపా కార్యక్రమాల్లో మీరెందుకు కనిపించడం లేదని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారందరికీ ఒక్కటే సమాధానం చెబుతా. ఆయా కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. వాటికి నన్ను ఆహ్వానించరు. ఒకవేళ సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో చెబుతారు. కొంతమంది ఊహిస్తున్నట్లు నేను అయితే పార్టీని వీడటం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తా’ అని ఖుష్బూ పేర్కొన్నారు. కాగా, ఖుష్బూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు, ఖుష్బూ అనుమతితోనే తాను ఇది షేర్ చేశామని మీడియా సంస్థ పేర్కొనడంపై ఆమె మరోసారి స్పందించారు. “ఆ సంస్థ చెబుతున్న దానిలో నిజం లేదు. ఈ విషయాన్ని వారు నా దృష్టికి ఏమాత్రం తీసుకురాలేదు. ఫోన్ కాల్ రికార్డు చేస్తున్నామని మీరు నాకెప్పుడు చెప్పారు?” అని ప్రశ్నిస్తూ మరో పోస్ట్ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here