జానీ మాస్టర్‌ కొన్ని ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్‌ కావడం, 36 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తర్వాత ఇప్పటివరకు ఎక్కడా నోరు విప్పని జానీ మాస్టర్‌ కొత్త సంవత్సరం సందర్భంగా అందర్నీ విష్‌ చేస్తూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జైలులో తన అనుభవాలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం ఎలా అనిపించింది అనే విషయాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘ప్రతిరోజూ షూటింగ్‌ పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లి పిలలతో హ్యాపీగా గడిపే నేను జైలుకి వెళ్లడం అనేది ఊహించలేదు. అయితే మొదట్లో జైల్‌లో చాలా ఇబ్బంది పడ్డాను. నేలమీద పడుకోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం నన్ను ఎంతో బాధపెట్టింది. అయితే జైలులో ఎవరికైనా అదే ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఉండదు. నా వరకు నేను ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్‌ అయ్యాను. నా భార్య, పిల్లలు, అమ్మ.. వీళ్ళంతా ఎప్పుడూ గుర్తొచ్చేవారు. అమ్మకి హెల్త్‌ బాగాలేదు. ఇలాంటివి ఆమె దృష్టికి వెళితే ఏమవుతుందో అని టెన్షన్‌ పడ్డాను. అయితే అందరి ముందు నా ఫీలింగ్స్‌ బయట పడనివ్వలేదు. నా బాధనంతా గుండెల్లోనే దాచుకొని ఆ తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాను. శత్రువుకి కూడా అలాంటి పరిస్థితి రావద్దని, జైలు జీవితాన్ని చూడకూడదని కోరుకున్నాను. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయిన సమయంలో ఆయన పిల్లలు గుర్తొచ్చారు. ఆ టైమ్‌లో వారి పరిస్థితి ఎలా ఉందో అనుకున్నాను.

పవన్‌కళ్యాణ్‌గారు నన్ను జనసేన పార్టీ కార్యకలాపాలకు కొన్నాళ్ళు దూరంగా ఉండమని ఒక లెటర్‌ పంపారు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే. నేను ఆ స్థానంలో ఉన్నా అదే చేస్తాను. ఆరోజు నేను వున్న పరిస్థితిలో రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌ నన్ను సపోర్ట్‌ చేసినా, చేయకపోయినా వారిపై నాకు ఉన్న అభిమానం, ప్రేమ ఎప్పటికీ తగ్గదు’ అని తన మనసులోని భావాలను తెలియజేశారు జానీ మాస్టర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here