పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చినప్పటికీ.. పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న చర్చ మాత్రం ఆగలేదు
ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్ గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే… ఆయన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొని ఉంది. అంతే కాకుండా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు, అలాగే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి. మెగా పవర్ స్టార్ గా ఆయనకు ప్రేక్షకులలో తిరుగులేని ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషించారు.
అయితే పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమపై కూడా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావడంపై తాను పెద్దగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే షూటింగుల కోసం వారే ఇక్కడకు వస్తారని ఆయన చెప్పారు.
అయితే రాష్ట్రాలుగా విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాలే తనకు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అయినా హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషి కూడా ఒక కారణమన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ పరిశ్రమ అయినా ఒక రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అనేది అంత తేలిక కాదన్న చంద్రబాబు నాయుడుఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలం పడుతుందని, వాటిని కల్పించిన తరువాతే పరిశ్రమను ఏపీకి ఆహ్వానించడంపై ఆలోచిస్తాననీ, ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని విస్పష్టంగా చెప్పారు.