రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మెడకు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. తెరవెనుక ఉండి ఆయనే రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఆధారాలతోసహా పోలీసులు గుర్తించారు. దీనికితోడు జయసుధను విచారించిన సమయంలోనూ, కేసులో ఉన్న మరో నలుగురిని విచారించిన సమయంలోనూ పేర్ని నాని పేరును ప్రముఖంగా వారు ప్రస్తావించారట. దీంతో పేర్ని నానిని అరెస్టుచేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు పోలీసులు పక్కా ఆధారాలతో రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ6 ముద్దాయిగా ఉన్న పేర్ని నాని.. అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, వచ్చే సోమవారం బెయిల్ పిటిషన్‌పై మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఆ తరువాత పేర్ని నాని అరెస్టు ఖాయమని వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు గురించి విచారిస్తున్న క్రమంలో పోలీసులు మరికొన్ని వివరాలను సేకరించారు. ఇతర జిల్లాల్లోనూ కొందరు వైసీపీ నేతలు గోదాముల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టుకు తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడితే మరికొందరు వైసీపీ నేతలు సైతం జైలు ఊచలు లెక్కించడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
వైసీపీ హయాంలో తన సతీమణి జయసుధ పేరిట పేర్ని నాని గోదాములను నిర్మించారు. ఆ గోదాములను పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గోదాములో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పెద్ద ఎత్తున బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బియ్యం మాయమైనట్లు నిర్దారణకు వచ్చిన పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యాజమాని పేర్ని జయసుధ, గోదాము మేనేజర్ మనస తేజ్, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మానసత్ తేజ్, కోటిరెడ్డితోపాటు మరో ఇద్దరి మధ్య దాదాపు 25లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు, పేర్ని నాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు కూడా మానస్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, తేడా వచ్చిన రేషన్ బియ్యం మొత్తానికి డబ్బులు చెల్లిస్తామని పేర్ని నాని కుటుంబం అధికారులకు లేఖ రాసింది. రూ.3.37 కోట్లకుపైగా విలువైన బియ్యం మాయమైందని అధికారులు అంచనాకు వచ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాలని సూచించగా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న జయసుధ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మానస్ తేజ్, కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంతరం సోమవారం రాత్రి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. విచారణలో వీరు గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. ఎఫ్ఆర్ఐ నమోదు చేయగా.. నాని అరెస్టు అవుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. వచ్చే సోమవారం వరకు నానిని అరెస్టు చేయొద్దని కోర్టు పోలీసులకు అదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది.
అంతే కాకుండా బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో ఆమె బుధవారం మధ్యాహ్నం విచారణ నిమిత్తం ఆర్ పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రెండు గంటలకుపైగా పోలీసులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే.. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. అయితే, స్టేషన్ బయట వైసీపీ శ్రేణులు పెద్ద హంగామానే చేశారు. మా మేడమ్ ను ఇంతసేపు విచారిస్తారా అంటూ పోలీసులపై నోరుపారేసుకున్నారు. రెండు గంటలకుపైగా జయసుధను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు.
పేర్ని జయసుధను విచారించిన తరువాత.. గోదాములో రేషన్ బియ్యం మాయం వ్యవహారం వెనుక కథ నడిపింది పేర్ని నాని అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడకు తరలించారని పోలీసులు గుర్తించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందా సైతం క్రమంగా వెలుగులోకి వస్తుంది. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. మరోవైపు ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. వారం రోజుల్లో పేర్ని నానిని అరెస్టు చేసి జైలు పంపించడం ఖాయమని, పోలీసులకు నాని అడ్డంగా దొరికిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. మొత్తానికి రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మెడకు ఉచ్చు బలంగా బిగుసుకుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.