బుల్లితెర మీద జబర్దస్త్ షోలో నూకరాజు కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. జడ్జ్ ఇంద్రజాను అమ్మ అమ్మ అని పిలుస్తూ కామెడీ చేస్తాడు. అప్పుడప్పుడు గెటప్ శీనులా గెటప్స్ వేస్తాడు. ఐతే నూకరాజు తన ఇండస్ట్రీ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. “నేను డిప్లొమా చేసేటప్పుడు యాదమ్మ రాజును, సద్దాంని పటాస్ షోలో చూస్తూ ఉండేవాడిని. నేను మా విజయవాడలో ఒక గల్లీ కమెడియన్ ని. ఐతే నేను కూడా ఇలాంటి వెళ్తే బాగుండేది కదా అనుకునే వాడిని. అలా పటాస్ ఆడిషన్స్ కి ట్రై చేసాను. కానీ సెలెక్ట్ కాలేదు. కానీ జీ తెలుగులో వచ్చే కామెడీ కిలాడీలు షోకి ఆడిషన్స్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ హైదరాబాద్ కి ఏదో చేసేద్దాం అని వచ్చి వారం ఉండి వెళ్ళిపోయాను. తర్వాత విజయవాడలో నా పని చేసుకుంటూ నేను ఆడిషన్స్ కి ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్లకు ఒక్కటే చెప్తున్నా..మొత్తం అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఇండస్ట్రీ నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు. మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి.
ఇంట్లో పని చేసుకుంటూనే కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. జీ తెలుగు నుంచి పటాస్ ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలా బండి నడిపిస్తున్న. జీ తెలుగులో కామెడీ షో ఆగిపోయాక నేను మళ్ళీ విజయవాడ వచ్చి నా కూలి పనులు చేసుకున్నా. ఆ టైములో నేను బతకాలి హైదరాబాద్ లో రూమ్ రెంట్ లు కట్టాలి కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. నేను యాక్టింగ్ లాంటిది ఏమీ నేర్చుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్లకు రోజు సంపాదించుకోవడానికి జాబ్ చేయడానికే టైం సరిపోదు మళ్ళీ యాక్టింగ్ ప్రాక్టీస్ లు అంటే కుదరని పని. అందరినీ చూసి యాక్టింగ్ నేర్చుకున్నా అంతే. టక్ జగదీశ్ లో, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీస్ లో చేసినప్పుడు నాకు చాలామంది సినిమా వాళ్ళు ఫోన్ చేసి బాగా చేసావ్ అన్నారు. గుమ్మడికాయంత కష్టపడినా కానీ ఆవగింజంతైనా అదృష్టం ఐతే ఉండాలి..” అంటూ చెప్పుకొచ్చాడు నూకరాజు.