మన చుట్టూ మనుషులందరూ  ఒకేలా ఉండరు, ఒకేలా ఆలోచించరు  అనే విషయం మనకి తెలిసిందే. కొందరు ఎప్పుడూ సరదా సరదాగా ఉంటూ, చుట్టుపక్కల మనుషులందరితో  సులువుగా కలిసిపోతారు. ఇంకొందరు ఎక్కడున్నా నలుగురిలో అంత సులువుగా కలవలేక కొంచెం మొహమాటంగా, నెమ్మదిగా ఉండాలనుకుంటారు. ఇంకొందరు తనకి అలవాటున్న చోట  ఫ్రీగా ఉండగలుగుతారు, అలవాటు లేనిచోట మౌనంగా ఉండిపోతారు. సైకాలజిస్టులు మనుషుల స్వభావాలను బట్టి వివిధ రకాలుగా విభజించారు. వీరిలో ఒక్కొక్కళ్ల ప్రవర్తనను బట్టి ఒక్కో విధమైన రకమైన గుణాన్ని ఆపాదిస్తూ ఉంటారు.  తప్పు చేయకపోయినా సరే సమాజంలో తప్పుగా అర్ధం చేసుకోబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఇంట్రోవర్స్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడే ఇంట్రోవర్ట్ లు చాలా వరకు తమ చుట్టు ప్రక్కల ఉన్నవారి నుండి విమర్శలే ఎక్కువగా ఎదుర్కొంటు ఉంటారు.  ఇంట్రోవర్ట్స్ అంటే ..

ఇంట్రోవర్ట్స్  అంటే ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులు.  వీరు ప్రశాంతమైన, నెమ్మదిగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు. సామాజిక కార్యకలాపాల్లో  ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత అలసిపోయిన ఫీలింగ్లో ఉంటారు.  తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.  ఇంట్రోవర్ట్స్  మెదడు డోపమైన్ అనే రసాయనానికి భిన్నంగా ప్రతిస్పందిస్తుందని సైకాలజీ తెలుపుతుంది.

సైకాలజీ ఏం చెప్తోందంటే..

ఇంట్రోవర్ట్స్  గురించి సైకాలజీ చాలా చెబుతుంది.  ఇంట్రోవర్ట్ గురించి మాట్లాడిన  తొలి ప్రముఖులలో స్విస్ సైకాలజిస్టు కార్ల్ గుస్తావ్ జంగ్ ఒకరు. 1921లో ఆయన రాసిన “సైకాలజికల్ టైప్స్” అనే పుస్తకంలో ప్రతి మనిషిని అంతర్ముఖులు లేదా బహిర్ముఖులుగా విభజించవచ్చని ప్రతిపాదించారు. అంతర్ముఖులను గ్రీస్ దేవుడు అపోలోతో పోల్చి వారు లోతైన ఆలోచనలతో ఉంటారని చెప్పారు. అప్పటినుంచి, మరెన్నో సైకాలజీ సిద్ధాంతాలు ఇంట్రోవర్ట్స్  గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి.

ఇంట్రోవర్ట్స్ గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

ఇంట్రోవర్ట్స్  కొత్త విషయాలకు  త్వరగా స్పందించగలుగుతారు.  కానీ మార్పును గమనించడంలో కొంచెం సమయం తీసుకుంటారు.  వీరు ఏదైనా సమస్య, ప్రమాదం,  ఇబ్బంది మొదలైన విషయాలకు అస్సలు భయపడరు. కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు లోతుగా ఆలోచిస్తుంటారు. సృజనాత్మకంగా కూడా ఉంటారు. వీరు బహిర్ముఖుల్లా నటించే ప్రయత్నం చేస్తే వారి పనితీరు మీద ప్రభావం పడుతుంది.  వీరికీ సంతోషం అత్యంత ప్రాధాన్యతగల విషయంగా అనిపించదు.

ఇంట్రోవర్ట్స్ డే  ఇలా మొదలైంది..

“హాపిలీ ఇంట్రోవర్టెడ్ ఎవర్ ఆఫ్టర్” అనే ఉచిత ఈ-బుక్ రచించిన జర్మనీకి చెందిన ప్రసిద్ధ సైకాలజిస్టు ఫెలిసిటాస్ హైన్ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని సృష్టించినట్టు చెబుతున్నారు. 2011 సెప్టెంబర్ 20న ఆమె తన “ఐపర్సానిక్” వెబ్‌సైట్‌లో ” ఇందుకే మనకు ప్రపంచ ఇంట్రోవర్ట్ డే  అవసరం” అనే శీర్షికతో బ్లాగ్‌ను ప్రచురించారు. ఈ వ్యాసం వరల్డ్ ఇంట్రోవర్ట్ డేకి ప్రేరణగా నిలిచింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here