మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు. సంక్రాంతి కంటే ముందుగానే ఆయన లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 11న లండన్ బయలుదేరి వెళ్లాలని భావిస్తున్నారు.
అయితే ఆయన అనుకున్నంత మాత్రాన విదేశీ పర్యటనకు వెళ్లగలిగే వెసులుబాటు ఆయనకు లేదు. ఆయన అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్నారు. అందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సీబీఐ కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో ఈ నెల 11 నుంచి 25 వరకూ యూకేలో ఉన్నత చదువులు చదువుతున్న తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన పిటిషన్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత జగన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి. ఆ తరువాతే జగన్ కు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చేదీ లేనిదీ కోర్టు నిర్ణయిస్తుంది.
గతంలో కూడా జగన్ తన విదేశీ పర్యటనలకు ముందుగా కోర్టు అనుమతి పొందిన సంగతి విదితమే. గత ఏడాది ఏపీలో ఎన్నికల తరువాత ఫలితాలు వెలువడక ముందేజగన్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు మరోసారి ఆయన తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ సారి జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో లేకపోవడం, జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీం సీబీఐకి విస్పష్ట ఆదేశాలు జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనకు అనుమతి లభించడం అంత సులువుకాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పండుగ వేళ ఏపీని వదిలి విదేశాలకు వెళ్లాలనుకోవడం చూస్తుంటే ఆయన రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశానికి తిలోదకాలిచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.