ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్న ఈ కుంభమేళాపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఉగ్రవాదులు సాధువుల రూపంలో దాడులకు తెగబడే అవకాశం ఉందన్నహెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.