తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం క్యూ కట్టి మరీ రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కూడా ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో పార్టీ కోసం గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీ ఆ రెండు ఎన్నికలలోనూ చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించినా, రాష్ట్రంలో అధికారం అన్న కల మాత్రం నెరవేరలేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనైనా అత్యధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో పెచ్చరిల్లిన విభేదాల కారణంగా ఆ ఆశ నిరాశ కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో అంతర్గత విబేధాలకు ప్రధాన కారణం.. అగ్రనాయకత్వం ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుని కీలక పదవులు అప్పగించడమే కారణమని అంటున్నారు. ఆ కారణంగానే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. దీంతో కింకర్తవ్యం అని పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఉంది. పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కూడా ముందువెనుకలాడాల్సిన పరిస్థితి నెలకొంది. పాతవారిని సముదాయించలేక, కొత్త వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులూ పడుతోంది.