మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగుపెట్టనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే ప్రచార చిత్రాల్లో తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో చరణ్ కనిపించాడు. అయితే ఇప్పుడు ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తన సినీ కెరీర్ లో ‘మగధీర’, ‘నాయక్’ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసి మెప్పించిన రామ్ చరణ్.. మొదటి సారి ‘గేమ్ ఛేంజర్’లో ట్రిపుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్.. తండ్రి మరియు ఇద్దరు కుమారుల పాత్రలలో కనిపించనున్నాడట. స్వార్థంలేని ప్రజా నాయకుడు తండ్రి అప్పన్న పాత్రలో, అలాగే నిజాయితీగల ఐఏఎస్ అధికారి కొడుకు రామ్ నందన్ పాత్రలో చరణ్ నటించినట్లు ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం. అయితే రామ్ నందన్ కి కవల సోదరుడిగా ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి పాత్రలోనూ చరణ్ కనిపిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ ను గమనిస్తే.. ప్రజా నాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా మాత్రమే కాకుండా.. ఐపీఎస్ అధికారి గానూ చరణ్ కనిపించాడు. దీనిని బట్టి చూస్తే.. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేసిన వార్త నిజమయ్యే అవకాశముంది. అంతేకాదు ఈ చిత్రంలో చరణ్ పోషించిన తండ్రి పాత్రకు నత్తి ఉంటుందట.

‘గేమ్ ఛేంజర్’లో చరణ్ ట్రిపుల్ రోల్ చేయడం, అందులో ఒక పాత్రకు నత్తి ఉండటం నిజమైతే.. దీనిని జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాతో పోల్చే అవకాశముంది. ఆ సినిమా మరేదో కాదు.. ‘జై లవ కుశ’. అందులో ఎన్టీఆర్, ముగ్గురు సోదరులుగా ట్రిపుల్ రోల్ చేశాడు. వాటిలో పెద్దన్నయ్య జై పాత్రకు నత్తి ఉంటుంది. ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ నటనను మంచి పేరు వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’లో కూడా చరణ్ అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించగా.. మా హీరో గొప్పంటే, మా హీరో గొప్పంటూ ఇటు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ విడుదల తర్వాత కూడా.. ‘జై లవ కుశ’తో పోలుస్తూ మరోసారి ఇరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here