అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.
కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు. ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు.
ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే.. వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది.