గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి.  ప్రభుత్వం దళారీ వ్యవస్థ ను  రూపుమాపలేకపోతోంది. దళారీల నుంచి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం మానేసి ఖజానా నింపుకోవడానికి  జీఎస్టీ పేరుతో  ప్రజల నడ్డి విరుస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేయలేక పోవడంతో  సామాన్యుడిపై రోజు రోజుకూ ధరల భారం పెరుగుతోంది.

దాదాపు ఏడాది కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ప్రజల కొనుగొలుశక్తిని క్షీణింప చేసింది.  ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉంది. నిత్యావసరాలపై జీఎస్టీ భారం పెరగడంతో  మధ్యతరగతి, బడుగు జీవుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి మధ్యతరగతి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది.  కుటుంబరుణాలు జీడీపీలో 6.4 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారమే  భారతీయ కుటుంబాల ఆదాయాలు తగ్గి,రుణాలు పెరుగుతున్నాయి.  తాకట్టు రుణాలు 56 శాతం పెరిగాయి. వీటిలో 30శాతం డీఫాల్ట్ గా మారుతున్నాయి.  రూపాయి మారకపు విలువ కనిష్ట స్థాయికి చేరడంతో విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పుకునే కేంద్రంలోని మోడీ సర్కార్.. ప్రజల ఆర్థిక పతనాన్ని పట్టించుకోవడం లేదు. షేర్లు, కార్పొరేట్లు అంటూ సంపన్న వర్గాల ప్రయోజనాలే పరమావధి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధికంగా జీఎస్టీ విధించే దేశంగా భారత్ అగ్రభాగంలో నిలబడింది.

ఒకేదేశం,ఒకే పన్ను అంటూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ఈ విధానంలోని లోటుపాట్లను సరిదిద్దే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు.  పెట్రోల్,డిజిల్ లను జీఎస్టీ పరిధిలో తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను పెడచెవిన పెడుతోంది. సెస్సు,సుంకాలపేరుతో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా బాదేస్తూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయి.  ఇక తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సొంత భుజాలు చరిచేసుకుంటున్న కేంద్రంలోని మోడీ సర్కార్   ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు సరికదా డీఏపీ కి  సబ్సిడీ ఎత్తివేసే ఆలోచన చేస్తున్నది. ఇక బియ్యం అయితే పండిచిన రైతుకూ, కొనుగోలు చేసే వినియోగదారులకూ కూడా చుక్కలు చూపిస్తోంది. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసే వినియోగదారుడికి మాత్రం ధరా భారం నడ్డి విరిచేస్తున్నది.  బ్రాండ్ల పేరుతో 25కేజీలు రూ.1600 పైగా అమ్ముతున్నారు. అలాగే పప్పుల ధరలు రైతులకు మేలు చేయలేకపోయినా వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపుతున్నాయి. ఏ పప్పు అయినా కేజీ ధర 100 నుంచి 200వరకూ ఉన్నాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే ఏ కూరగాయ కొనాలన్నా  కిలో  రూ.60నుంచి 100 వరకూ వెచ్చించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here