అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడలాడిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రతతో విరుచుకుపడుతున్న మంచు తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోయింది. దాదాపుగా అమెరికాలోని పలు ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. ఈ మంచు తుపాను అమెరికాలోని కాన్సాస్, నెబ్రస్కా, ఇండియానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు కోట్ల మందికి పైగా మంచు తుపానులో చిక్కుకుపోయి నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఈ సవాల్ ను ఎదుర్కొనేందుక అమెరికా సమాయత్తమౌతోంది. పలు రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
మంచులో చిక్కుకుపోయిన వాహనదారులను కాపాడేందుకు నేషనల్ గార్డ్ రంగంలోనికి దిగింది. మంచు తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఎనిమిది అంగుళాల మేర సర్వం మంచుమయంగా మారిపోయింది. గంటకు80 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఇండియానాలోని పలు భాగాలు మంచుకిందకప్పబడిపోయాయి. ఈ ప్రాంతంలో వాహనదారులు రోడ్లపైకి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు తుపాను ప్రభావిత ప్రాంతాలలో రైలు, విమాన సర్వీసులను రద్దు చేశారు.