హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళను వేధిస్తున్నాడని, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తిని చితకబాదారు నలుగురు దుండుగులు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి ఇంకో వ్యక్తిపై దాడి చేశాడు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో అలా అనిపించడం సహజం. పైగా సొంత వారిని వేధింపులకు గురి చేశారని తెలిస్తే కొన్ని సార్లు చంపడానికి కూడా వెనకాడరు కొందరు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి అదే ఆవేశంలో తన భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేశారు. కానీ, అక్కడ అవతలి వ్యక్తి అసలైన నిందితుడు కాదు.. ఒకరిని అనుకుని మరొకరిపై దాడి చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్బీ ప్రాంతంలోని ధర్మారెడ్డి కాలనీలో ఉన్న ఓ హాస్టల్‌లో గాలి వరప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి ఓ యువతి, ముగ్గురు వ్యక్తులు ధర్మారెడ్డి కాలనీలోని హాస్టళ్లలో గాలిస్తూ చివరికి ఈ వరప్రసాద్ ఉంటున్న హాస్టల్ వద్దకు వచ్చారు. ఇక్కడ వరప్రసాద్ ఎవరైనా ఉన్నారా అని వారు ప్రశ్నించగా.. గాలి వరప్రసాద్, తానే వరప్రసాద్ అని బయటకు రాగానే ఆ ముగ్గురు వ్యక్తులు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఎందుకు, ఏమిటీ అని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా దాడి చేయడంతో మొదట అతనికి ఏమీ అర్థం కాలేదు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ రక్తసిక్తం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వచ్చిన ఆ నలుగురిని విచారించగా అసలు విషయం బయటపడింది. దాడి చేసిన వ్యక్తులు వేరే ఎవరో వరప్రసాద్ కోసం వచ్చి, తప్పుగా గాలి వరప్రసాద్‌పై దాడి చేసినట్లు గుర్తించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టారీతిన ఒక వ్యక్తిపై దాడికి పాల్పడినందుకు ఆ నలుగురిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.