పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20, శుక్రవారం నాటితో ముగిశాయి, లోక్‌సభ, రాజ్యసభ రెండూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి తీవ్ర నిరసనలు, దాడి ఆరోపణలు, ఏకకాలంలో ఎన్నికలు శాసనసభ ఒత్తిడితో కూడిన గందరగోళ కాలానికి ముగింపు పలికింది. అలాగే చివరి క్షణంలో ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ రాజ్యాంగ సవరణ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సూచించే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అలా ముగిశాయి. విపక్షాల ఆందోళనలతో నెల రోజులు ఉభయసభలు అట్టుడికాయి. కానీ నెల రోజులంతా ఒక ఎత్తైతే.. గురువారం జరిగిన తంతు మరో ఎత్తు. 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. ఓవైపు రాజ్యంగంపై పదునైన ప్రసంగాలు.. అదానీ వ్యవహారంపై ఘాటైన విమర్శలు.. మధ్యలో తోపులాటలు.. గాయాలు.. ఇలా సాగిన వింటర్ సెషన్స్‌ ఎట్టకేలకు ముగిసింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనూహ్య ఘటనలకు వేదికయ్యాయి. దాదాపు నెల రోజులపాటు జరిగిన సమావేశాల్లో పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య తీవ్ర సంవాదం నడిచింది. ఆందోళనల పర్వం కొనసాగింది. పదునైన సంభాషణలకు వేదికైంది. చివరి రోజైన శుక్రవారం కూడా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులే కనిపించాయి. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఇటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించడంతో…పార్లమెంటు గౌరవాన్ని, సభలో శాంతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపైనా ఉందని సభ్యులను శాంతపరిచే ప్రయత్నం చేశారు స్పీకర్ ఓంబిర్లా. సభలో జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇటు రాజ్యసభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీజేపీసీకి పంపేందుకు ఆమోదముద్ర పడింది.

నవంబర్ 15 నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో అనేక కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. అదానీ వ్యవహారంపై విపక్షసభ్యుల ఆందోళనలతో సభ అట్టుడుకుంది. దాదాపు 14రోజుల పాటు అదానీ వ్యవహరంపైనే రచ్చ జరిగింది. దీంతో ఉభయసభల విలువైన సమయం వాయిదాలకే సరిపోయింది. ఇక పార్లమెంట్ చరిత్రలో తొలిసారి రాజ్యసభ చైర్మన్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చాయి. చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌పై విపక్షాల గొంతును నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ..ఇండి కూటమి నో కాన్ఫిడెన్స్ మోషన్‌ ఇచ్చింది. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్‌కు మూవ్ అయ్యేందుకు తగినంత సమయం లేకపోవడం, డాక్యుమెంట్ లోపాలతో సహా విధానపరమైన సమస్యల కారణంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తిరస్కరించబడింది. ఇక అదానీ గ్రూప్ లంచం ఆంరోపణలపై విపక్షాలు విరుచుకుపడుతుంటే.. రివర్స్‌లో సోరోస్ గాంధీ బంధం గురించి ఏమంటారంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగింది.

ఇలా అధికార విపక్షాల ఆందోళనలతో ప్రతిరోజూ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. అయితే రాజ్యంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్లమెంట్ లో రెండురోజుల పాటు చర్చ జరిగింది. ఈ రెండ్రోజులు సభ్యులు పూర్తిగా హాజరై రాజ్యాంగంపై తమ అభిప్రాయాలతో పాటు పదునైన ప్రసంగాలు చేశారు. రాజ్యాంగ చర్చలోఅధికార విపక్షాల పరస్పర ఆరోపణలతో సభ వేడెక్కింది. ఇక ఎంతో ఉత్కంఠ రేపిన జమిలీ బిల్లును సభముందుకు తీసుకొచ్చింది మోదీ సర్కార్. దీనిపై విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు పరిశీలించేందుకు ఓటింగ్ ద్వారా జేపీసీకి పంపేందుకు ఆమోదముద్ర పడింది.

ఇక అంబేద్కర్‌పై అమిత్‌షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారంటూ విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనప్రదర్శనలకు పిలుపునిచ్చింది. అమిత్‌షా రాజీనామా చేయాలని.,.జాతికి క్షమాపణ చెప్పాలంటూ విఫక్షాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. అయితే తాను అంబేద్కర్‌ను అవమానించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా వివరణ ఇచ్చారు.

అమిత్‌షా వివరణ ఇచ్చినా విపక్షాలు మాత్రం శాంతించలేదు. ఈనెలరోజుల పాటు జరిగన ఆందోళనలు ఓ ఎత్తైతే…గురువారం జరిగిన ఆందోళనలు మరోఎత్తు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు బ్లూకలర్ దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్‌ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. జై భీమ్ నినాదాలు చేశారు. మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని బాబా సాహెబ్‌ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసనకు దిగింది.

ఇలా పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పార్లమెంటు మకరద్వారం వద్ద గోడపైకి ఎక్కి విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ఈసందర్భంలోనే అధికార విపక్షాలు ఎదురుపడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సభ్యుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈతోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి తలకు గాయమైంది. రాహుల్ గాంధీ నెట్టడంతోనే తాను పడ్డానని సారంగి తెలిపారు. మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్‌ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి తనపై పడటంతో కిందపడి గాయపడ్డానని సారంగి తెలిపారు. ఈ తోపులాటలో మరో ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌‌కూ గాయాలయ్యాయి. వెంటనే సారంగితోపాటు ముకేశ్‌నూ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీల ఆరోపణలను రాహుల్ గాంధీ, ఖర్గే తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌ లోపలికి వెళ్లనీయకుండా బీజేపీ ఎంపీలు తమను అడ్డగించారని..కర్రలతో తమను బెదిరించేందుకు ప్రయత్నించారని రాహుల్ ఆరోపించారు. ఇటు బీజేపీ ఎంపీలు కూడా కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పార్లమెంట్‌లో రాహుల్ ఓ గూండాలా ప్రవర్తించారని…మహిళా ఎంపీలపైనా ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మావైపు దూసుకొచ్చారు. మాకు అతి దగ్గరగా వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టాడు. మమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా అతని వ్యవహరించిన తీరు మాకు చాలా ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా మహిళా ఎంపీల దగ్గర రాహుల్ ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓ ఎంపీ..తోటి సభ్యుల పట్ల గౌరవంగా ఉండాలి. ఈరోజు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈవిషయంపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని బీజేపీ ఎంపీలు తెలిపారు.

నాగాలాండ్ ఎంపీ ఫాంగ్నాన్ చివరిరోజు రాజ్యసభలో కన్నీరు పెట్టుకుని రాహుల్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మహిళా సభ్యురాలి పట్ల అభ్యంతరంగా ప్రవర్తించడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో రాజ్యసభ చైర్మన్ ఆమెను సముదాయిస్తూ..జరిగిన ఘటనను పరిశీన లో ఉందని తెలిపారు. మరోవైపు చివరిరోజు కూడా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విపక్ష సభ్యులు విజయ్ చౌక్ నుండి పార్లమెంటుకు పాదయాత్ర చేశారు. అయితే పార్లమెంట్ ప్రాంగణంలోనే పోటాపోటీ నిరసనలు చేపట్టడమే కాకుండా ఒకర్నొకరు గాయాలు చేసుకునే రీతిలో ఎంపీలు ఘర్షణకు దిగడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ ప్రాంగణంలో హుందాగా ఉండాల్సిన ఎంపీలు ఇలా పరస్పరం తోసుకుని గాయాలపాలవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీరియస్‌ అయిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్లమెంట్ గేట్ వద్ద ఎలాంటి నిరసనలు చేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీలను హెచ్చరించారు లోక్‌సభ స్పీకర్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here