ఫార్ముల-ఈ కార్ రేసు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంలో ఈ రేసు కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో అరెస్ట్ నుంచి ఊరట పొందిన కేటీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఊరట లభించగానే.. రేసు కేసు డొల్లఅని, అందుకే తొలి అడుగులోనే కాంగ్రెస్‌కు చుక్కెదురైందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.
అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపడంతో బీఆర్ఎస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా ఈడీ పేర్కొంది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా… విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.