గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా? మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయేదాక లెక్కలు మన జీవితంలో భాగంగా ఉన్నాయి.  చిన్న పిల్లల చాక్లెట్ల లెక్క నుంచి సైంటిస్టుల రాకెట్  లాంచింగ్ దాకా ఈ లెక్కలు అన్ని చోట్లా ఉపయోగపడుతున్నాయి. డబ్బు మీద నడిచే ఈ కాలంలో లెక్కలు, గణాంకాలు లేకుండా ఏదీ జరగదు. మరి అలాంటి గణితమంటే మనలో చాలామందికి  అదేదో పెద్ద అర్ధం కానీ మిస్టరీలా అనిపించి, వింటేనే వణుకు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇష్టపడితే దీనంత ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు అంటారు గణిత ప్రియులు.ప్రపంచ నడకకి అడుగడుగునా అవసరమయ్యే ఈ గణిత శాస్త్రం మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. గణిత శాస్త్ర చరిత్రలో భారత గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైనది. అందులో శ్రీనివాస రామానుజన్ గారిది ప్రత్యేక స్థానం. అందుకే  గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్ధం ఆయన పుట్టినరోజయిన  డిసెంబర్ 22వ తేదీని ప్రత్యేక దినంగా  గుర్తించారు. రామానుజన్ గారి  125వ జయంతి సందర్భంగా 2012, డిసెంబర్22వ తేదీన,  భారత ప్రభుత్వం  అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించింది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా నంబర్ థియరీ, పార్టిషన్ ఫంక్షన్ లు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.  ప్రత్యేకమైన ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటే..శ్రీనివాస రామానుజన్  1887 లో,  తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నాణ్యమైన విద్య అందకపోయినా  తన  12 వ ఏటనే త్రికోణమితిలో తన ప్రావీణ్యాన్ని చూపారు. రామానుజన్  14 వ ఏట మద్రాసులోని పచాయప్ప కాలేజీలో చేరి ఇతర సబ్జెక్టులలో ఫెయిలైనా కూడా, గణితంపై మాత్రం  స్వతంత్ర పరిశోధన చేశారు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగం పొందేందుకు రామస్వామి అయ్యర్ సాయం చేశారు. అలా అక్కడ పని చేసుకుంటూనే ఆయన రకరకాల గణిత సిద్ధాంతాలు నోట్సుల్లో  రాసుకునేవారు. 1913 లో ఆయన సిద్ధాంతాలని చూసి ఆశ్చర్యపోయిన కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త  GH హార్డీ, రామానుజన్‌ను లండన్‌కు ఆహ్వానించారు. అలా అక్కడ  రామానుజన్ గణితం మీద మరింత కృషి చేశారు.  1918 లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన అతితక్కువ వయస్కుల్లో రామానుజన్ ఒకరు. ఆయన రాసిన చాలా గణిత సిద్ధాంతాల  మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రంలో  చేసిన కృషి దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప  ప్రభావం చూపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here