పుష్ప2 సినిమా విడుదలై నప్పటినుంచి సక్సస్ ,వసూళ్లూ సంచలనాలు రేపడం ఒక పార్శ్వమైతే.. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడం మరో పార్శ్వం. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరికి రాజకీయ రంగు పులుముకుంది. సంధ్యా ధియోటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుండటం తెలిసిందే.
ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ద్వారా మధ్యంతర బెయిలు పొంది అల్లు అర్జున్ బయటకు రావడం, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పుష్ప2 రచ్చ రంబోలాగా మారింది. చివరకు ఈ వివాదం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకుంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ స్పందన అతిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో ఇంత కాలం దొరకని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరాటపడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతు లభించినట్లు, తెలంగాణలో అభిమానులు,క్రేజ్ ఉన్న అర్జున్ ను తురఫ్ కార్డు గా ఉపయోగించుకోవాలని బీజేపీ తాపత్రేయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీనాయకులు , తెలంగాణ బీజేపీ నాయకుల ప్రకటనల వెనుక బీజేపీ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే కాకుండా, సినీ జనాల మద్దతును గంపగుత్తగా పొందేయాలన్న ఆరాటమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. సంధ్యా ధియోటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదని, సినిమా రీలీజ్ సందర్భంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగడం పరిపాటే నని సమర్ధించడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు.
ఈ సంఘటనలో తప్పు అల్లు అర్జున్ దేనిని పోలీసుల వీడియో నిర్ద్వంద్వంగా చాటుతోంది. ప్రభుత్వం కూడా అదే భావిస్తోంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి మరీ తాను నిర్దోషినని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి వరకూ అల్లు అర్జున్ పట్ల జన బాహుల్యంలో కొద్దో గొప్పో వ్యక్తమైన సానుభూతి ఆవిరైపోయింది. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూసిన తరువాత అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నట్లు ప్రకటించారంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్ధమౌతోంది. ఇక అల్లు అర్జున్ నష్ట నివారణ చర్యలకు దిగుతారని అంతా భావిస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగి.. ఇది కేవలం కక్ష సాధింపు,తొందర పాటు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మరో వైపు బీఆర్ఎస్ కూడా రాజకీయంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తనకు అందివచ్చిన అవకాశంగా భావించి ఆయనకు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెసు కు మజ్లీస్ మద్దతు ఇస్తున్నది.
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని రేవంత్ స్పష్టం చేసారు. అన్నిటికీ మించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన క్యారెక్టర్ ను తగ్గించాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు, తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటాలన్న ప్రయత్నంతోనే తాను సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొన్న గొప్పలతో వివాదం మరింత ముదిరింది. తప్పు అర్జున్ దని,కాదని అర్జున్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి వివాదాన్ని తగ్గించాలని గాంధీ భవన్ కు వచ్చి రాష్ట్ర ఇన్చార్జి దాస్ మున్షీ కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రేవంత్ వ్యాఖ్యలపై అర్జున్ కామెంట్స్ కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ వివాదం ఎంత వరకూ వెడుతుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు హైదరాబాద్ నుంచి చిత్రపరిశ్రమ తరలిపోయేంత వరకూ ఈ వివాదం సాగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ నాటికి ఈ వివాదం సర్దుమణిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.