వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి పులివెందులకు చేరుకుంటారు.
తొలుత ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌కు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయలుదేరి వెళతారు.
రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి పులివెందులలో బస చేస్తారు. 26వ తేదీన ఉదయం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగుళూరుకు చేరుకుంటారు.