రేవంత్ స‌ర్కార్, టాలీవుడ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించింది.  పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట చోటుచేసుకుని మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సినీ న‌టుడు అల్లు అర్జున్‌, థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌రువాత అల్లు అర్జున్ అరెస్టు కావ‌టం, బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌టం చకచకా జరిగిపోయాయి.

అయితే, వివాదం స‌ర్దుమ‌ణిగింద‌ని అంతా భావిస్తున్న దశలో  థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే అల్లు అర్జున్ మీడియా స‌మావేశం పెట్టి రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో రేవంత్ స‌ర్కార్‌, సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ఎవ‌రూ పూడ్చ‌లేని గ్యాప్‌ ఏర్ప‌డిందని అంతా భావించారు. కానీ  రెండుమూడు రోజుల‌కే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు.  దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు కొంద‌రు భేటీ  అయ్యారు. ప్ర‌భుత్వం, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వివాదం స‌మ‌సిపో యిందనిపించారు. అయితే, గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనూ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా వివాదం కొన‌సాగింది. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో వివాదాన్ని పెంచుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం త‌న చాకచక్యంతో వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు సినీ పెద్ద‌ల ప‌ట్ల జ‌గ‌న్ అప్పట్లో అవ‌లంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీని చుల‌క‌న‌గా చూశార‌న్న‌ వాద‌న ఉంది. సినిమా రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా కొద్ది రోజులు వివాదం కొన‌సాగింది. ఈ క్ర‌మంలో  మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మ‌హేశ్‌బాబు, ప్ర‌భాష్‌, రాజ‌మౌళి త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏవైనా.. ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్య‌క్తి వెళితే ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించేది. కానీ, జ‌గ‌న్ మాత్రం చిరంజీవి, ఇత‌ర హీరోల వాహ‌నాల‌ను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో వారు కార్ల‌ను గేటు బ‌య‌టే వ‌దిలేసి జ‌గ‌న్ ను క‌లిసేందుకు న‌డుచుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. దీనికితోడు జ‌గ‌న్ తో స‌మావేశం అయిన స‌మ‌యంలో మీరేంటి హీరోలు.. నేను అస‌లైన హీరో అన్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న క‌నిపించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండ‌స్ట్రీకి మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌టంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ తీరుప‌ట్ల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  చిరంజీవి ప‌ట్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మెజార్టీ ప్ర‌జ‌లుసైతం సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. దీనికితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు సినీ ఇండ‌స్ట్రీపై నోరుపారేసుకున్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఘోరం ఓట‌మికి ఈ ఘ‌ట‌న కూడా కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు.

తెలంగాణలో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అయితే, హైద‌రాబాద్ లో చెరువులను ఆక్ర‌మించి నిర్మించిన క‌ట్ట‌డాల‌ను ప్ర‌భుత్వం కూల్చివేత‌ల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హీరో నాగార్జున‌కు సంబంధించిన ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి రేవంత్ రెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కొద్దిరోజుల త‌రువాత కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల వ్య‌వ‌హారాన్ని మంత్రి కొండా సురేఖ ప్ర‌స్తావించారు. దీంతో అక్కినేని కుటుంబంతోపాటు సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈక్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారింది. తాజాగా పుష్ప‌-2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవంతి అనే మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘట‌న‌కు సంబంధించి అల్లు అర్జున్ స‌హా ప‌లువురిపై కేసు న‌మోదైంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైల‌ుకు పంపించారు. అదే స‌మ‌యంలో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుద‌లై అల్లు అర్జున్ త‌న నివాసానికి వెళ్లిన త‌రువాత సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించారు. దీంతో రేవంత్ స‌ర్కార్ వ‌ర్సెస్ సినీఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా వివాదం మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు ఆస్ప‌త్రిలో ప్రాణాపాయ‌స్థితిలో చికిత్స పొందుతుంటే అత‌న్ని చూసేందుకు వెళ్ల‌ని సినీ ప్ర‌ముఖులు జైలుకు వెళ్లివ‌చ్చిన అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించ‌టం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా త‌ప్పుబ‌ట్టారు. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు ఉండ‌వ్‌, టికెట్లు పెంపు ఉండ‌ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశారు. దీంతో సినీ పెద్ద‌ల రంగంలోకిదిగి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న‌ సినీ ప్ర‌ముఖుల ప‌ట్ల‌ రేవంత్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వంగా న‌డుచుకున్నారు. హీరో నాగార్జున‌, వెంక‌టేశ్ తో రేవంత్‌ ఆప్యాయంగా మాట్లాడారు. త‌ద్వారా  ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల్లో  కాఠిన్యం ఉన్నా.. సినీ ఇండ‌స్ట్రీ వారి ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంటామ‌ని రేవంత్ చెప్ప‌క‌నే చెప్పారు. ఈ స‌మావేశంలో సినీ పెద్ద‌ల ప్ర‌తిపాదనలను రేవంత్ ఆమోదించలేదు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు వంటి వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయితే రేవంత్ సినీ ప్రముఖులకు ఇచ్చిన మర్యాద ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. రేవంత్ తో భేటీ తరువాత ఆ భేటీకి హాజరైన వారంతా రేవంత్ ను పొగడ్తల వర్షంలో ముంచేశారు. దీంతో  గతంలో సినీ ప్రముఖులతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. రేవంత్ జగన్  మధ్య తేడాను ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది. అప్పట్లో సినీ హీరోల‌ ప‌ట్ల జ‌గ‌న్  వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమర్ధనీయం కాదన్న అభిప్రాయం మరో సారి వ్యక్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here