కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది. ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.
ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది.అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.