తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం (డిసెంబర్ 30) జరిగింది. మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్ సింగ్ కు సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ఒక వింత చోటు చేసుకుంది. సభలోనూ బయటా కూడా ఉప్పూ నిప్పులా ఉంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒకే మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తన ప్రసంగంలో కేటీఆర్ చెప్పారు.

కాగా సభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో    తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని.. మంచి ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి  మన్మోహన్ సింగ్ దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ ప్రశంసించారు.  మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేసిన ఆయన  రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ కృషిని విస్మరించలేమన్నారు.  ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆధార్ లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానిది అని కొనియాడారు. సరళీకృత విధానాలతో భారత్‌ ప్రపంచంతో పోటీ పడేలా చేశారని.. దేశానికి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈ తరంలో మన్మోహన్‌ సింగ్‌తో పోటీపడేవారే లేరని రేవంత్ పేర్కొన్నారు.

అనంతరం ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన కేటీఆర్.. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న రేవంత్ ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులనీ, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందనీ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here